ఎర్రసూర్యుడే సౌరకుటుంబాన్ని కబళిస్తాడా..
“జాతస్య మరణం ధృవం”ఈ నానుడి ప్రాణమున్న మనకే కాదండోయ్.. మనం ప్రత్యక్షదైవంగా భావించి పూజించుకుంటున్న సూర్యభగవానునికి కూడా వర్తిస్తుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసిన పరిశోధనల్లో తేలిందట. మన భూమిపై నున్న సకలప్రాణులకు వెలుగును,శక్తిని అందిస్తూ సౌరమండలానికే కేంద్రమైన సూర్యుడు ప్రస్తుతం నడివయస్సుకు చేరుకున్నాడని శాస్త్రవేత్తలు తేల్చారు.
గతకొద్దికాలంగా సూర్యుడిపై సౌరజ్వాలలు, బ్లాక్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని తెలియజేసారు. ఇప్పుడు సూర్యుడి వయస్సు సుమారు 4.57 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. ఇంకా సూర్యునిలోని శక్తి 4.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. సూర్యుడే కాదు ప్రతీ నక్షత్రమూ న్యూక్లియస్ ఫ్యూజన్ చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును హీలియంగా మారుస్తూ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈశక్తే ఇంధనంగా మారి సోలార్ సిస్టమ్‌లోని గ్రహాలకు శక్తి లభిస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. కొన్నేళ్లకు హైడ్రోజన్, హీలియం అడుగంటిపోయి నక్షత్రం అంతిమదశకు చేరుకుంటుంది. ఇలా సూర్యుడిలో జరిగిన తర్వాత మధ్యభాగంలో హైడ్రోజన్ తగ్గిపోయిన తర్వాత సూర్యుడు RED GIANT గా మారిపోతాడు. అనగా తన పరిమాణం పెంచుకుంటూ అనూహ్యంగా పెరిగిపోతాడన్నమాట. ఒక్కొక్క గ్రహాన్ని తనలో కలుపుకుంటూ, కబళిస్తూ పెరిగి, ఆ తర్వాత PLANETARY NEBULA గా మారిపోయి, చల్లబడుతూ చివరికి WHITE DRAFT STAR (మరుగుజ్జు నక్షత్రం)గా మారిపోతాడు. పూర్తగా శక్తి కోల్పోతే BLACK DRAFT STAR గా మారిపోతాడు. ఇదండీ మన సూర్యుని జీవితచక్రం..
సూర్యుడు లేకపోతే ఎలా అంటూ బెంబేలు పడిపోకండేం. ఇదంతా జరగడానికి సుమారు 450 కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటికి భూమిపై జీవజాలమే ఉండకపోవచ్చు. లేదా భూమి కూడా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణంలో అనూహ్య మార్పులకు మానవుడు కారణం కాకుండా భూమిని, ప్రకృతిని కాపాడుకుందాం..