భారత్ అభివృద్ధికి 7 కీలక నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, రైల్వేలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఈ నిర్ణయాలు దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలకంగా మారనున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.1,27,500 కోట్లు కేటాయించారు. అలాగే మొబైల్ ఫోన్ తయారీ ప్రోత్సాహానికి రూ.62,500 కోట్లతో ప్రత్యేక పథకానికి ఆమోదం లభించింది. వ్యవసాయ రంగంలో దేశీయ యూరియా ఉత్పత్తి పెంపునకు నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ ఫర్ యూరియా- 2026కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వారణాసి అభివృద్ధిలో భాగంగా రూ.25,446 కోట్లతో వరుణా, గంగా నదులపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇవి నగర రవాణా, పర్యాటక రంగానికి ఊతమివ్వనున్నాయి.
రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ.3,907 కోట్లు మంజూరు చేశారు. ఇందులో పారాదీప్– హరిదాస్‌పూర్ రైల్వే లైన్ డబ్లింగ్, డాంగోవాపోసి–రాజ్‌ఖర్సవాన్ మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఈ నిర్ణయాలతో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
