రాజస్థాన్ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి
రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళా భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌కు 115 కిలోమీటర్ల దూరంలో గల సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో జాతర సందర్భంగా సోమవారం తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ట్వీట్ చేశారు.