NewsTelangana

మునుగోడు మొనగాడెవరు?

Share with

మంటలు అంటుకున్నాయి. అసంతృప్తి సెగలు రివ్వున రేగుతున్నాయి. ఒకటి వెంట ఒకటిగా ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో జరుగుతుందని .. ఎంతో మేలవుతుందని భావించిన అధిష్టానానికి తెలంగాణలో ఎదురవుతున్న పరిణామాలు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. పార్టీ నుండి పాత కాపులను వెళ్ళగట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలను బానిసలుగా చూస్తున్నారన్న తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. ఇప్పుడేం జరగబోతోంది ? కాంగ్రెస్ పరిస్ధితి ఏంటి ? వాట్ నెక్స్ట్ ? ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే ప్రశ్నలు.

సమన్వయం గాడి తప్పింది. ఐక్యత బద్దలయ్యింది. నోరు అదుపు తప్పుతోంది. విమర్శలు రివ్వున దూసుకు వస్తుంటే.. సమాధానాల కోసం తడుముకోవాల్సిన పరిస్ధితి. ఆరోపణలు ఫౌన్ టెయిన్ లా ఎగజుమ్ముతుంటే.. ఎదురు దాడి చేయలేని స్ధితి. ఓవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. అంతర్గత కుమ్ములాటలు పార్టీని బజారుకీడుస్తున్నాయి. ఇదీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్ధితి. పీసీసీ సారధ్య బాధ్యతల నుండి ఉత్తమ్ కుమార్ ను తప్పించిన నాటి నుండి అంతా అయోమయంగా మారింది. ఎన్నో ఆశలతో పగ్గాలు చేపట్టిన రేవంత్ కు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు లోపం ఎక్కడ ? ఎందుకిలా జరుగుతోంది ? అందరినీ కలుపుకు పోదాం అనుకుంటే.. ఎక్కడా పొసగని వైనం కనిపిస్తోంది. సీనియర్లను దారికి తెచ్చుకోవడంలో వ్యవహారం ఎక్కడో మెలిక పడుతోంది. ఏడాదిగా ఇదే తీరు. దీనికి తోడు వరుస ఓటములు. పట్టుతప్పుతున్న పగ్గాలను బిగించడానికి నానా తంటాలు. దీనికంతటికీ కారణం రేవంత్ రెడ్డే అంటూ బహిరంగ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నాయకగణం సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. చేసిది లేక .. నేతల గోడు ఢిల్లీ నుండి వినేవారు రాక ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. దీంతో పార్టీలో పెద్ద కల్లోలం బయలుదేరింది. కాషాయ కండువాలు కప్పుకునేందుకు కాంగ్రెస్ దండంతా ఇప్పుడు ఢిల్లీకి బారులు కడుతోంది. నిన్నటి మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఓ దివిటీలా వెలిగిన మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రావణ్ లాంటి వారంతా ఇప్పుడు పార్టీని వీడి వెళ్ళి పోతున్నారు. ఇక కాంగ్రెస్ లో ఉండలేమన్న భావన కింది స్ధాయి నుండి బలంగా నాటుకు పోతోంది. సత్వరమే నాయకత్వాన్ని మార్చకపోతే మరింత నష్టం తప్పదన్న అభిప్రాయం కూడా కొందరు సీనియర్ల నుండి వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్న కృతజ్ఞతా భావంతో సోనియా, రాహుల్ పై నమ్మకం ఉంచి ఎంతో మంది తెలంగాణ ఉద్యమ నేతలు కాంగ్రెస్ లో చేరారు. కానీ.. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడుతున్న పరిస్ధితులు ఏర్పడ్డాయి. రేవంత్ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే తాము ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఉన్న సమస్యను చెప్పుకోవడానికి లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను వినే ఢిల్లీ నేతలు అంతకన్నా లేరు. అధిష్టానం దూతలుగా ఎంతమంది వచ్చినా .. చూస్తున్నారు.. వెళుతున్నారు. కానీ.. ఎవరినీ పట్టించుకోవడం లేదు. వారి గోడు వినిపించుకోవడం లేదు. ఇది కూడా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి ఓ కారణం. కేవలం రేవంతే కాదు.. ఢిల్లీ పర్యవేక్షకినిగా ఉన్న మాణిక్యం .. అతనితో పాటు పొలిటికల్ కన్సల్టెంట్ సునిల్ పాత్ర కూడా ఈ కల్లోలం ప్రధానంగా ఉందని అంటున్నారు. వారి పట్టీపట్టని ధోరణి, నిరంకుశ విధానాలే ప్రస్తుత పరిస్ధితికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అసంతృప్తి వనేతలను పార్టీనీ వీడేలా చేస్తున్నాయి. చాలా మటుకు బీజేపీ పంచన చేరి పోతున్నారు. ఇంకా చాలా మంది కర్చీఫ్ లు వేశారు. రేపోమాపో వారంతా ఢిల్లీలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఓ బ్యాచ్ బీజేపీలో చేరబోతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యం కాబోతున్నాయి. అన్ని పార్టీలు మునుగోడుపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఉన్న స్ధానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. ఆ స్ధానంలో బీజేపీ జెండా ఎగరేసి .. తెలంగాణాలో రానున్నది తమ సర్కారే అన్న సంకేతాలు ఇవ్వాలని కమలనాధులు తహతహలాడుతున్నారు. మరోవైపు అధికార పార్టీ మునుగోడు తమదే అంటూ బీరాలు పలుకుతోంది. అటు కాంగ్రెస్ లో మొదలైన సంక్షోభ పరిస్ధితులు .. మునుగోడును ఏ పార్టీ గొడుగు కిందకు తీసుకువెళ్ళబోతున్నాయో ఆసక్తిగా మారింది. మునుగోడు ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో ఉత్కంఠ రేపుతోంది.