Home Page SliderTelangana

బోధ్‌లో ఎగిరేది ఎవరి జెండా?

బోధ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అంతర్గత విభేదాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థికి టికెట్ నిరాకరించింది. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన రాథోడ్ బాపూరావును కాదని పార్టీ అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించింది. గతంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో కొట్లాడి ఓడిన అనిల్ జాదవ్ ఈసారి బోథ్ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ నేతగా బరిలో దిగుతున్నారు. ఇక్కడ్నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో రాథోడ్ బాబూరావు బీజేపీలో చేరడంతో నియోజకవర్గంలో ఈసారి ఎలాంటి పరిస్థితులుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ నుంచి ఆడె గజేందర్, బీజేపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు. ముక్కోణపు పోటీలో అదృష్టం తమనంటే తమని వరిస్తుందని నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఓట్లలో ఎన్ని వస్తే గెలవొచ్చన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు.

బోథ్ (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్‌లో 302 పోలింగ్ బూత్‌లో పురుష ఓటర్లు 1,00,656, స్త్రీలు 1,06,031 ట్రాన్స్‌జెండర్లు 3 మొత్తం ఓటర్లు 2,06,690 ఉన్నారు. ప్రతిష్టాత్మక బోథ్ నియోజకవర్గంలో గోండ్లు జనాభా 20 శాతంగా ఉంది. ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములను గోండ్లు ప్రభావితం చేస్తారు. ఈ నియోజకవర్గంలో మున్నూరుకాపులు 11 శాతానికి పైగా ఉన్నారు. మాదిగలు, మాలలు ఏడేసి శాతం చొప్పున ఉన్నారు. ముస్లింలు, లాంబాడాలు ఆరున్నర శాతంగా ఉన్నారు. ఇతర బీసీలు, రెడ్లు 6 శాతం మేర ఉన్నారు. ఇతర ఎస్టీలు 5 శాతం, ఇతర ఓసీలు 4 శాతం ఉన్నారు. ఇతర ఓటర్లు 25 శాతం వరకు ఉన్నారు.