Home Page SliderTelangana

“రైతు ఆత్మహత్యల తెలంగాణ మనకొద్దు”…కిషన్ రెడ్డి

“రైతు ఆత్మహత్యల తెలంగాణ మనకొద్దు.. మోదీ నాయకత్వం లోని రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి” అంటూ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామిర్ పేట పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి ఎరువుల రిటైల్ సేవ కేంద్రాలు … పీఎం కిసాన్ సేవ కేంద్రాలుగా మారనున్నాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న మోదీ ప్రభుత్వం రైతు అవసరాల్ని గుర్తించి అన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి, రైతుకు మరింత దగ్గరయ్యారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, భూసార పరీక్షలు, సీడ్ టెస్ట్ ఇలా అన్ని సేవలు ఒకే దగ్గర రైతులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను దశల వారిగా ‘కిసాన్ సమృద్ధి కేంద్రాలు’గా మారుస్తాం వీటిని దశలవారిగా ‘మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా కూడా అప్-గ్రేడ్ చేస్తున్నం. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటుచేస్తున్నం.

ఇందులో భాగంగా.. నేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా.. 1.25 లక్షల కిసాన్ సమృద్ధి కేంద్రాలను రైతులకు అంకితం చేసారని తెలిపారు. మన తెలంగాణలోనూ 4900కు పైగా ఎరువుల దుకాణాలు PM ‘కిసాన్ సమృద్ధి కేంద్రా’లుగా అప్‌గ్రేడ్ అవుతున్నాయని తెలిపారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ అనే నినాదంతో అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యతనిస్తూ.. అన్నదాతలకు గౌరవాన్ని కల్పించే విధంగా పలు పథకాలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పీఎం-కిసాన్ ద్వారా రైతుల అకౌంట్లలో ఏడాదికి రూ.6వేల రూపాయలు బదిలీ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. గత ప్రభుత్వాల్లాగా రైతు సంక్షేమాన్ని మాటల్లో కాకుండా.. మోదీ సర్కారు చేతల్లో చూపిస్తున్నది. దీంతోపాటుగా.. 14వ విడత ‘పీఎం-కిసాన్’ నిధులు రేపు విడుదల కానున్నాయని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 8.5 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ.17,500 కోట్లు జమచేయనున్నారు. మన తెలంగాణలో 39.5 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.800 కోట్లు జమకానున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెంటింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు.. 1600కు పైగా FPO (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్)ను ONDC (ఓపెన్ నెట్‌వర్క్ – డిజిటల్ కామర్స్) పరిధిలోకి తీసుకొచ్చే కార్యాచరణను కూడా చేపట్టామని తెలిపారు.

“ప్రపంచానికి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా మారాలి మన భారత్. ఆదిశగా మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. గతేడాది ప్రధానమంత్రి గారు.. ‘ఒకే దేశం – ఒకే ఎరువు’ (వన్ నేషన్ – వన్ ఫెర్టిలైజర్) పథకాన్ని ప్రారంభించిండ్రు. ఈ పథకం కింద ‘భారత్’ బ్రాండ్‌తో నాణ్యమైన యూరియా తక్కువ ధరకు రైతులకు దొరుకుతున్నాయి. తెలంగాణలో మాత్రం పంటబీమా అమలైతలేదు. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న రైతులు పరిహారం కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి మన దగ్గర ఉన్నది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేస్తా అని మాయమాటలు తియ్యని మాటలు చెప్పి మోసం చేసాడు కేసీఆర్. ‘సీడ్ బోల్ ఆఫ్ ఇండియా’ అని చెప్పిన ఫామ్ హౌస్ పెద్ద ఏదీ నీ హామీ?. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోయి ఈ రాష్ట్రం లో రైతు సంక్షేమ ప్రభుత్వం రావాలి. మేము అధికారం లోకి రాగానే ప్రగతి భవన్ ని ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తాం” . రైతు ప్రభుత్వాన్ని రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ న్యాయాకత్వం లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలనితెలంగాణ ప్రజల్ని కోరారు కిషన్ రెడ్డి.