నిత్యానందకు రక్షణ కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితికి కైలాస దేశ ప్రతినిధుల విజ్ఞప్తి
ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద ‘కైలాస’ వేషాలు
వివాదాస్పద నిత్యానంద స్వయం ప్రకటిత దేశం ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యారు. అక్కడ “హిందూ మతం అత్యున్నత గురువు “కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ (CESCR) సమావేశం ఫిబ్రవరి 24న జెనీవాలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను నిత్యానంద అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో పాటు మొత్తం మహిళా ప్రతినిధి బృందం పాల్గొన్నట్లు తెలుస్తోంది. “నిర్ణయాత్మక వ్యవస్థలలో మహిళల సమాన, సమ్మిళిత ప్రాతినిధ్యం”పై ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది.
కొన్నాళ్ల క్రితం భారతదేశాన్ని విడిచిపెట్టిన నిత్యానంద తన ఆశ్రమాన్ని కైలాస అని పిలిచే ప్రదేశంలో స్థాపించాడు. ఈ స్థలం ఎక్కడుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్‌లో పేర్కొన్నదాని ప్రకారం కైలాస ప్రతినిధులలో ఒకరు చీర, తలపాగా మరియు ఆభరణాలు ధరించిన మహిళ – “స్థిరమైన అభివృద్ధి” రంగంలో తన దేశం తీసుకున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నట్లు కన్పించింది. కైలాసంలో ఆహారం, నివాసం, దుస్తులు, విద్య, వైద్యం వంటి అన్ని ప్రాథమిక అవసరాలు “ఉచితంగా అందించబడతాయి” అని ఆమె చెప్పారు. హిందూ మతం పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు నిత్యానంద హింసించబడ్డాడని, అతని జన్మ దేశం నుండి నిషేధించబడ్డాడని… అలాంటి పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని ఆమె ఐక్యరాజ్యసమితిని కోరారు.
‘ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు, సుస్థిర అభివృద్ధిపై సాధారణ వ్యాఖ్యపై సాధారణ చర్చా దినోత్సవం’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో కైలాస ప్రతినిధులు చర్చలో ఎలా పాల్గొన్నారనేది క్లారిటీ రావడం లేదు. అసలు వీరిని ఎవరు ఆహ్వానించారన్నది అంతుబట్టడం లేదు. ప్రశ్నలు లేవనెత్తడానికి కేటాయించిన సమయంలో కైలాస తరపున ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. కర్ణాటకలోని రామనగరలో నిత్యానంద అత్యాచారం కేసును ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఆగస్టులో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కూడా జారీ అయ్యింది. నిత్యానంద మాజీ డ్రైవర్ లెనిన్ ఫిర్యాదు మేరకు 2010లో అత్యాచారం కేసు నమోదైంది. వివాదాస్పద నిత్యానందను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. 2020లో, నిత్యానంద దేశం నుంచి పారిపోయాడంటూ లెనిన్ చేసిన పిటిషన్‌పై మళ్లీ బెయిల్‌ను రద్దు చేశారు.

