దేవాలయాల అభివృద్దే కూటమి ఎజెండా
దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల కేంద్రంలోని శివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం తెలిపారు .తరువాత ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, వేద పండితులు, దేవాలయ అధికారులు పూర్ణకుంభముతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారు.
తిరుమల పరకామణి అంశంపై ఇప్పటికే శాసన మండలిలో వివరించామని, రాబోయే రోజుల్లో పూర్తి సమాచారాన్ని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. “శాసనసభలో స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో మాట్లాడే అవకాశం రాలేదు. అయితే మండలిలో మాత్రం సమగ్ర వివరణ ఇచ్చాం” అని అన్నారు.
సనాతన ధర్మం పాటిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో భగవంతునికి పూజా కైంకర్యాలు పూర్తిగా శాస్త్రోక్తంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 361 దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఖాళీగా ఉన్న దేవాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటించే కార్యక్రమం చేపడతామని ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. పట్టణాల్లో ఉన్న అన్న క్యాంటీన్ల తరహాలో గ్రామీణ దేవాలయాల్లో కూడా ఉచిత అన్నప్రసాదం అందించే విధానాన్ని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విధ్వంసం జరిగిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేవాలయాల్లో చెప్పుకోలేని తప్పులు జరిగాయి. ఆ పాపాలను ఇప్పుడు మేమంతా మోస్తున్నాం. ఆ పాపాలను కడిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది” అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఆధ్యాత్మికతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దేవాలయాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరికీ భగవాన్ నామస్మరణతో ఆనందంగా ఉండే వాతావరణం కల్పించడమే లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

