Home Page SliderInternational

డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్ర విజన్ ప్లాన్ 2047

అమరావతి: ఆధునిక భారతదేశ నిర్మాణానికి మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో కేంద్రం వికసిత భారత్ 2047 కార్యక్రమాన్ని చేపట్టిందని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర విజన్ ప్లాన్-2047 రూపకల్పనకు అవసరమైన శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో బుధవారం ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమంలో అమె పాల్గొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మక వృద్ధిని సాధించేందుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు చర్యలు చేపట్టామని ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ సమావేశంలో వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు విజన్ ప్లాన్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ హరీంధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.