ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ రాజకీయ రంగప్రవేశం?
👉 చిలకలూరిపేట,గుంటూరు ఈస్ట్ లేదా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాలపై కన్ను?
👉 ఆరా ఫౌండేషన్ ద్వారా సొంత జిల్లాలో సేవా కార్యక్రమాలు
👉 టీడీపీ లేదా జనసేన లో చేరతారంటున్న అనుచరులు?
👉 ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ఆరా మస్తాన్?
ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్, సామాజిక సేవకుడు, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ షేక్ మస్తాన్ (ఆరా మస్తాన్) రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. పోల్ స్ట్రాటజిస్ట్ గా గత 16 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఓవైపు సర్వేలు, మరోవైపు పోల్ మేనేజ్మెంట్ ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయనాయకులకు సుపరిచితుడు. ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడంలో ఆయనను మించినవారుండరని రాజకీయనేతలు గట్టిగా చెబుతారు. అనేక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలోనూ ఆయన అంచనాలు వందకు వంద శాతం నిజమయ్యాయి. అంచనాలన్నీ నిజమైన ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. అందుకే ఆయన ఎగ్జిట్ పోల్ కు అంతపేరు వచ్చింది. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోతారని ఆయన చెప్పిన అంచనా నిజం కావడంతో… తెలుగు రాష్ట్రాల్లో ఆరా సర్వే సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ విధంగా ఆరా సంస్థకు డేటా ఖచ్చితత్వం విషయంలో మంచి పేరు ఉంది.

స్వశక్తిపై ఎదిగిన ఆరా మస్తాన్ మొదటి నుంచి తన సంపాదనలో కొంత భాగం సామాజిక సేవలకు వినియోగించడం అలవాటుగా చేసుకున్నారు. ఆరా ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. చిలకలూరిపేట, గుంటూరు కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు, భక్తజనులకు ఆయన దగ్గరయ్యారు. శివరాత్రి సమయంలో కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం దశాబ్ద కాలంగా నిరంతరం నిర్వహిస్తున్నారు. ఏటా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంతోపాటు, పేదలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఇక క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చిల పాస్టర్లకు మరియు పేదలకు వస్త్రాలు అందించడంతోపాటు, గడిచిన రెండేళ్లుగా కార్తీకమాసంలో చిలకలూరిపేటలో ఆయన చేపట్టిన కార్తీకదీపోత్సవం భక్తజనకోటిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నియోజకవర్గంలోని ఎయిడ్స్ రోగగ్రస్తులకు ఆరా ఆధ్వర్యంలో ప్రతి నెలా ఉచిత వైద్య పరీక్షలు – ఉచితంగా మందులు, నెలకు సరిపడా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో ఆరా ఫౌండేషన్ ద్వారా ఎంతో మందినీ ఉన్నత చదువులు చదివించడంతో పాటు , తనకున్న పరిచయాల ద్వారా వందలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు. తన స్వగ్రామం మద్దిరాల లో 2015 లో తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం తాను ప్రారంభించిన నాడు- నేడు పథకం నేడు ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప పథకం గా పేరు తెచ్చుకుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా తాను చేసిన అభివృద్ధితో ఆ స్కూల్ మోడల్ స్కూల్ గా నిలిచింది. కరోనా కాలంలో జిల్లా వ్యాప్తంగా ఆరా ఫౌండేషన్ కోట్ల రూపాయల ఖర్చుతో చేసిన విశేష సేవా కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు.

ఒక వ్యక్తిగా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్న ఆరా మస్తాన్.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగి.. పేద ప్రజలకు అండగా నిలవాలని అనుచరులు, నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ లేదా జనసేన లో చేరే అవకాశం ఉంది. ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరిపేట నుంచి గానీ, గుంటూరు తూర్పు నుంచి గానీ పోటీ చేయాలనీ ఆయా పార్టీలు కోరినట్లు తెలుస్తోంది. చిలకలూరిపేట సొంత నియోజకవర్గం అయినందున, ఆయనకు ఆ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు, ఆ ప్రాంతంపై మంచి పట్టుకూడా ఉంది. టీడీపీ లేదా జనసేన నుండి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే పోటీచేయాలని అనుచరులు కోరుతున్నారు. అక్కడ సాధ్యంకాని పక్షంలో సొంత జిల్లాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న గుంటూరు ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పోల్ స్ట్రాటజిస్ట్ గానే కాకుండా, సామాజిక సేవకుడిగా కూడా ఆయనకు మంచిపేరున్నందున ఎన్నికలలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జిల్లాలోని పలువురు ప్రముఖులు, వివిధ సామాజికవర్గాల వారితో ఆయనకు ఉన్న మంచి సంబంధాలు కూడా ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఆయన టీడీపీ టికెట్ తో ఎన్నికల బరిలో దిగితే గెలుపు నల్లేరుపై నడేకనని అనుచరులు భావిస్తున్నారు. ఆరా మస్తాన్ ఎన్నికల గోదాలో దిగితే… అటు పార్టీకి కూడా ప్రయోజనంగా ఉంటుంది. అంతేకాకుండా,ఆ పార్టీ ఖచ్చితంగా గెలిస్తుందనే భావన రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో, పార్టీలకు ఆర్థిక సహాయం చేసే పారిశ్రామిక వేత్తల్లో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మైనార్టీలు ఇప్పటి వరకు వైసీపీకి మద్దతుగా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో, ఆ వర్గంలో మంచి గుర్తింపు ఉన్న ఆరా మస్తాన్ టీడీపీలో చేరితో ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ లభిస్తోందన్న అంచనాలున్నాయి. ఆరా మస్తాన్ ప్రయత్నిస్తే టీడీపీ ఆయనకు కోరిన చోట టికెట్ కేటాయించే అవకాశం ఉంది. పలువురు. మీడియా ప్రతినిధులు ఈ విషయమై ఆరా మస్తాన్ ప్రతిస్పందన కోరగా తనకు రాజకీయాల్లో రావాలనే ఆలోచన అసలు లేదని ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

