కిలో 30 పైసలకే ఉల్లి..ఏపీ రైతులు గగ్గోలు
కర్నూలు: ఏపీలో ఉల్లి రైతులు భారీగా పడిపోయిన ధరతో గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఉల్లి కేవలం 30 పైసలకు పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి అర్ధ రూపాయి కూడా పలకడం లేదని వాపోతున్నారు. వేలంలో కనీస ధర క్వింటాల్ 30 రూపాయలు పలుకుతోంది. అంటే కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి దిగుబడి ఉన్నా.. రాబడి లేదని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం ఉల్లి రైతులకు క్వింటాలుకు ఆరువేల రూపాయల వరకు ధర పలికింది. ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఉల్లిరైతులు పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లి వేలం వేస్తే కొనే నాధుడు లేడు. వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట కూడా కుళ్ళిపోతోంది. ఉల్లిని కర్నూలు మార్కెట్ కి తీసుకువెళ్తే కొనే దిక్కులేక సరుకును తిరిగి తీసుకు వెళ్లలేక అక్కడే వదిలిపెట్టి వెళుతున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తున్న అధికారులు క్వింటాల్ ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరల వల్ల మార్క్ ఫెడ్ కు తీవ్ర నష్టం కలిగింది. ఇప్పటివరకు ఐదు వేల టన్నుల ఉల్లిని మార్క్ ఫెడ్ కొనుగోలు చేయగా ఇందులో కేవలం 2000 టన్నులు సరుకు మాత్రమే రైతు బజార్లకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు, హైదరాబాద్ కు పంపించారు. ఇంకా 3 వేల టన్నుల ఉల్లి మార్కెట్లోనే ఉండిపోయింది . ఉల్లికి మార్కెట్ ధర లేకపోవడంతో వ్యాపారులకు అతి తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఇప్పటికే రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

