అటు కేశినేని, ఇటు రాయపాటి, చంద్రబాబుకు తలపోటు
• ఎన్నికలకు ఏడాది ముందే వినిపిస్తున్న ధిక్కారస్వరాలు
• నియోజకవర్గాల వారీగా స్టడీ చేస్తున్న అధినేత చంద్రబాబు
• నరసరావుపేట, విజయవాడ ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి
• తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం కుమ్ములాట
ఏపీలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఆయా పార్టీల్లో సీట్ల కోసం సీనియర్లు, యువ నాయకులు పోటీలు పడుతూ సత్తా చాటుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్ రాదని భావిస్తున్న సీనియర్లు మాత్రం ధిక్కారస్వరాలు వినిపిస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు తరచు పార్టీ అధిష్టానంపై తమకున్న అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది పైగా సమయం ఉండగానే సీట్ల కోసం నేతల కుమ్ములాట మొదలవడంతో చంద్రబాబుకు తలనొప్పులు మొదలయ్యాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేస్తుంది.

ఇదే సమయంలో పార్టీలోని కొందరు నేతలు సీట్ల కోసం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం తెలుగు తమ్ముళ్లను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. టికెట్ మాకంటే మాకని నేతల సవాళ్లకు దిగటమే కాకుండా అధిష్టానానికి తామేంటో చూపిస్తామన్న చేస్తున్న వ్యాఖ్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న విజయవాడ ఎంపీ కేశీనేని నాని తరచు అధిష్టానంపై తనకున్న అసంతృప్తిని బాహటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. నేరుగా మీడియా ముందే కాల్ మనీ వ్యాపారులు, బ్రోకర్లు, కబ్జాదారులకు టికెట్లు ఇస్తే సహకరించేది లేదని అధిష్టానానికి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అలాగే తన సోదరుడు చిన్నితో పాటు స్థానికంగా మరో ముగ్గురు నేతలకు టికెట్లు ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసే సత్తా ఉందని సవాల్ విసిరారు.

కేశినేని నానితోపాటు మాజీ ఎంపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కూడా టికెట్ల పంచాయితీని తెరపైకి తీసుకువచ్చారు. తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న డిమాండ్‌ను ఈసారి బాహటంగానే వినిపించారు. గతంలో రాయపాటి అధిష్టానానికి తన కుమారుడు రంగారావు తో పాటు కుమార్తెకు సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే మహానాడు వేదికగా రెండు టికెట్లు ఆశిస్తున్న నేతలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇస్తానని స్పష్టం చేశారు. తాజాగా నరసరావుపేట పార్లమెంటు సీటును పుట్టామహేష్ యాదవ్‌కు కేటాయించవచ్చు అనే వార్తల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు ఆ సీటును తన తనయుడు రంగారావుకు కేటాయించాలని డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేసి తన సీటును కడప వారికి కేటాయిస్తే సహకరించేది లేదని అవసరమైతే తానే బరిలోకి దిగుతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఇప్పుడు విజయవాడ నరసరావుపేట ఎంపీ స్థానాలలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. ఇలా సీనియర్ నేతలు బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉండటంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తమ్ముళ్లు రోడ్డుకెక్కుతూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఒకవేళ జనసేనతో పొత్తుకుదిరితే ఈ టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబుకు మరిన్ని తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

