Home Page SliderTelangana

గజ్వేల్ నుంచి బరిలో దిగుతానంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్‌పై మాత్రమే తనకు ద్వేషం ఉందని, పగ, ప్రతీకారం కల్వకుంట్ల ఫ్యామిలీపై మాత్రమే అన్న ఫీలింగ్ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గజ్వేల్‌లో హీటెక్కిన రాజకీయ వాతావరణానికి మరింత మంటపుట్టించేలా రాజకీయ సమీకరణం తెరపైకి వస్తుంది. గజ్వేల్ నుంచి బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి తాను బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నానని… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారు. ఇప్పటికే గజ్వేల్‌లో కేసీఆర్‌‌ని ఢీకొట్టేందుకు బీజేపీ అగ్రనేత, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సిద్ధమయ్యారు.

తాజాగా గజ్వేల్ గడ్డపై కేసీఆర్‌ను ఓడించేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం సైసై అంటున్నారు. హస్తం పార్టీ తీర్థం తిరిగి పుచ్చుకోబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చి ఎన్నికల్లో, తాను గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని పార్టీ పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగేందుకు సమయతమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలకు రెండేసి స్థానాలను ఇచ్చేందుకు నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలోదించేందుకు ప్రయత్నిస్తోందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ లో పోటీ చేస్తే, సీపీఐకి మునుగోడు కేటాయించే అవకాశం ఉంది.

ఒకవేళ మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడాల్సి వస్తే… రాజగోపాల్ రెడ్డి తన సతీమణిని టికెట్ కోరే అవకాశం ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. మొత్తంగా టికెట్ల పంపకం వేళ ఏం జరుగుతుందని దానిపై ఒక ఉద్విగ్య భరితమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి బరిలో దిగబోతుండటంతో గులాబీ బాస్‌ను అష్టదిగ్బంధనం చేసేలా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి.