బీహార్ టూర్ లో.. కేసీఆర్ బేజార్
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ టూర్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ను కేసీఆర్ కలిశారు. వారితో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేసేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టే ప్రయత్నం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇస్తున్నారు. ఈక్రమంలో అన్ని విషయాలు మీడియా ముందు పెట్టొద్దని కేసీఆర్‌ను వారించేందుకు నితీష్ ప్రయత్నించారు. అయితే ఆయన పట్టించుకున్నట్టు కనబడక పోవడంతో ఇక లాభం లేదనుకొని కుర్చిలో నుంచి లేచి నిలబడిపోయారు నితీష్ కుమార్. కానీ కేసీఆర్ మూసా దోరణిలో పదే పదే ఆయన్ను చేయిపట్టి కుర్చిలో కూర్చోవాలని సూచించారు. వెళ్లిపోదామండి బాబు అంటే కాదు కూర్చోవాల్సిందే అన్నట్టుగా వ్యవహరించారు. ఇక లాభం లేదనుకొని అయిష్టంగానే కుర్చిలో కూర్చున్నారు నితీష్ కుమార్.
ఈసన్నివేశం ఇద్దరు నేతల మధ్య అనేక విషయాల్లో పెద్దగా సయోధ్య లేదన్న విషయాన్ని కళ్లకు కట్టింది. పదేపదే చేయిపట్టి మీరు కూర్చోండి..మీరు కూర్చోండి అని కేసీఆర్ చెప్పడం, నితీష్ కుమార్ ఇష్టం లేనట్టుగా పదేపదే లేచి నిల్చోవడం. వెళ్దాం పద అంటే కేసీఆర్ వినిపించుకోకపోవడం..ఇటు ఈయన కుదురుగా కూర్చోమంటే ఆయన పట్టించుకోక పోవడం. మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని నితీష్ చెప్పడం వద్దంటే కూడా కేసీఆర్..మరీమరీ మాట్లాడటం ఇద్దరు నేతల మధ్య అసహనం మీడియా వర్గాల్లో హాట్‌టాపిక్ అయ్యింది.

గతంలో ఒడిశాలో పర్యటించినప్పుడు కూడా కేసీఆర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిసిన సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని కేసీఆర్ ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలని ఆయన సూచించారు. అయితే గులాబీ బాస్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ మీద మరింత విస్తృతంగా జరగాలని నవీన్ పట్నాయక్ నాడు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి సాగుతారా అన్న మీడియా ప్రశ్నకు తానింకా ఆలోచించుకోలేదని నవీన్ పట్నాయక్ అప్పుడే బదులిచ్చేశారు. కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్న స్థాయిలో .. ఫెడరల్ ఫ్రంట్‌పై తమకు ఆసక్తి లేదని ఆయన చెప్పకనే చెప్పారు,

పశ్చిమ బెంగాల్ పర్యటన సమయంలోను కేసీఆర్ కు ఫెడరల్ ఫ్రంట్‌పై మమతా నుంచి స్పష్టమైన హామీ లభించ లేదు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికి కాంగ్రెస్ కూడా సాయం చేయాలని మమతా భావిస్తుంటే..తాను ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు వ్యతిరేకమని కేసీఆర్ చెప్పుకున్నారు. దీంతో అప్పుడు కూడా ఇద్దరు సీఎంల భేటీ అసంపూర్తిగానే ముగిసింది. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ ఎక్కే గడప దిగే గడప చందంగా కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నా ఆయన ఫెడరల్ ఫ్రంట్ పట్ల ఆయా పార్టీల అధినేతలు అంత సానుకూలంగా స్పందిచినట్టు ఇప్పటివరకైతే పెద్దగా కనపడటం లేదు. పైగా ఫ్రోటోకాల్‌ను పక్కన పెట్టి ..చేతులు పట్టి గుంజటం..తమ మధ్య ఎంతో అప్యాయత ఉన్నట్టు మీడియా ముందే బయటపడి పోవడం చాలా మంది నేతలకు రుచించనట్టే కనబడుతోంది. జాయింట్ ఫ్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా కేసీర్‌తో నామ్‌కే వాస్తేగానే ఆ నేతలు కూర్చున్నట్టుగా కనపడింది. నేను చెప్పింది వినేయాలంటూ ఈయన..మేము చెప్పేది పట్టించుకోవాలంటూ వాళ్లు. చెప్పాలన్నది చెప్పేస్తా ..చేయాలనుకున్నది చేసేస్తా అన్న రీతిలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వివిధ రాష్ట్రాల ఏకధాటి టూర్‌లతో ఎక్కువగా కేసీఆరే బేజారైనట్టుగా కనపడుతోంది.

