తెలంగాణలో వరద బీభత్సం -ఎంత నష్టం వచ్చిందో తెలుసా?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా విపరీతమైన నష్టానికి గురయ్యింది. ఈ వరదల వల్ల 67వేల మంది నష్టపోయారు. వీరిలో కేవలం ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉన్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. మొత్తం 117 గ్రామాలలో ఈ నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 44ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా 13వేల పైచిలుకు జంతువులు మృతిచెందాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు కకావికలం అయ్యాయి. నివాసాలు బురద పాలయ్యాయి. చేతికి అందిన పంట వరదపాలయ్యింది. పొలాలలోకి రాళ్లు కొట్టుకువచ్చాయి. ఖమ్మంలోని మున్నేరు వాగు పోలేపల్లి పంచాయితీలో రాజీవ్ గృహకల్ప సముదాయాలు బాగా దెబ్బతిన్నాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా బురద పాలయ్యింది. ఈ గృహాల గోడలు బీటలు వారాయి. తలుపులు, కిటికీలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామాగ్రి మున్నేరు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రతీ ఇంటికీ లక్షల్లో నష్టం వాటిల్లింది.

