ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడిన శునకం
మాతృదేశ రక్షణకు ప్రాణాలొడ్డి పోరాటం చేసింది ఆ శునకం. సైనిక శిక్షణలో ఆరితేరిన ఆ జాగిలం సైనికులలాగే నిబద్ధత ప్రదర్శించింది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు దక్షిణ కాశ్మీర్‌లో తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందింది. దీనితో వారిని గుర్తించే పనిని ‘జూమ్’ అనే పేరుగల శునకానికి అప్పగించారు. అది అంతకు ముందు కూడా ఎన్నో ఆపరేషన్లలో చాలా బాగా సహాయం చేసింది. ‘జూమ్’ వారిని గుర్తించి, వెంటనే వారిపై దాడికి ప్రయత్నించింది. ఈ పోరాటంలో దానిపై రెండు తుపాకీ గుండ్లు దూసుకెళ్లాయి. అయినా లెక్కచేయకుండా దాడి కొనసాగించింది. ఇంతలో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను అంతమొందించారు. జూమ్‌ను ఆర్మీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ‘జూమ్’ త్వరగా కోలుకోవాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

