Home Page SliderTelangana

ధరణి దరఖాస్తుల పరిష్కారానికి, మార్చి 1 నుంచి 9వ తేది వరకు సదస్సులు

గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నామన్నారు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి 9వ తేది వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి దరఖాస్తుల పరిశీలన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కుట్రపూరితంగా, దురుదేశంతో తీసుకొచ్చిన ధరణితో ప్రజలు అవస్థలు పడుతున్నారని , దరణితో ప్రజల జీవితాలను గత ప్రభుత్వం ఆగం ఆగం చేసిందని, ధరణి తో రెవెన్యూ వ్యవస్థను కొల్లగొట్టారని ఆరోపించారు.

ధరణి తో ఎన్నో రైతు కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయని, లక్షలాది ఎకరాలు ధరణి పేరుతో మాయం చేశారని, గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండదండలు నిలిచారని విమర్శించారు. ధరణి పై నమోదుచేసిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించుటకు ప్రత్యేక రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేశామని, ప్రజలకు న్యాయం చేయాలని ఈ సదస్సుల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకునెందుకు సదస్సులు ఉపయోగపడుతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంచేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నామని అన్నారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు. ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.