NationalNews

బెంగాల్ నాయకుడి ఇంటి వద్ద బాంబు పేలుడు, ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడి ఇంటిపై జరిగిన బాంబు పేలుడులో కనీసం ముగ్గురు మరణించారు. తూర్పు మిడ్నాపూర్‌లోని కాంటాయ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. TMC నేత అభిషేక్ బెనర్జీ షెడ్యూల్ ప్రకారం ఇవాళ జిల్లాకు రావాల్సి ఉంది. భూపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగబన్‌పూర్ బ్లాక్ 2లోని నార్యబిలా గ్రామంలో పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో నార్యబిలా గ్రామంలోని తృణమూల్ కాంగ్రెస్ బూత్ అధ్యక్షుడి ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఇల్లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు కారణం ఏమన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.

పేలుళ్ల తీవ్రత చాలా శక్తివంతమైనవని పోలీసులు చెప్పారు. తృణమూల్ నాయకుడి ఇంటి వద్ద బాంబులు తయారవుతున్నాయని.. బీజేపీ ఆరోపించింది. ఈ పరిణామంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇలాంటి ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉన్నారని సీపీఐ (ఎం) సీనియర్‌ నేత సుజన్‌ చక్రవర్తి ప్రశ్నించారు. టిఎంసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిపోయిందన్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.