ధరాభారం కానున్న చల్లచల్లని బీరు
చల్లచల్లని బీరు….మెల్లమెల్లగా చేదుచేదుగా మారనుంది.అసలే ఎండాకాలం రాబోతుంది. ఉదయం 10గంటలు దాటితే చాలు చల్లని బీర్లను కవర్లలో చుట్టుకుని విడిది ప్రాంతాలకెళ్లి విలాసం చేయాలనుకునే యువతకు గరళం లాంటి న్యూస్ చెప్పింది తెలంగాణా సర్కార్. తెలంగాణలో బీర్ల ధరలను భారీ ఎత్తున సవరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.15 శాతం ధరల పెంపును సిఫారసు చేసిన రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీకి ఆమోదం లభించింది.ఈ కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.ధరల సవరణతో బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెరిగిన బీర్ల ధరలు. మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఎండాకాలంలోనే దాదాపు రూ.6వేల కోట్ల ఆదాయం రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

