టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది.. కన్నీటితో ఫెడరర్ గుడ్‌బై
ప్రపంచ టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది. తన ఆటతో రెండు దశాబ్దాల పాటు అభిమానులకు కనువిందు చేసిన టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్ రిటైర్ అయ్యాడు. తన కాలంలో క్రికెట్‌ను శాసించిన 41 ఏళ్ల ఫెడరర్ శనివారం లండన్‌లో చివరి మ్యాచ్ ఆడి ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా ఫెడరర్‌తో పాటు అతని చిరకాల ప్రత్యర్థి, స్నేహితుడు రాఫెల్ నాదల్, ప్రతి ఒక్క టెన్నిస్ అభిమాని కన్నీటి పర్యంతమయ్యారు. తన స్నేహితుడి రిటైర్మెంట్‌ను తట్టుకోలేని నాదల్ చిన్న పిల్లాడిలా విలవిల్లాడాడు.

కన్నీటి పర్యంతమైన ఫెడరర్, నాదల్
ఏటీపీ టూర్ మ్యాచ్‌లో భాగంగా రాడ్ లేవర్ కప్‌లో టీం యూరప్ తరఫున ఆడుతున్న ఫెడరర్‌కు నాదల్‌తో కలిసి శనివారం ఆడిన డబుల్స్ మ్యాచ్ చివరిది. ఆ మ్యాచ్‌లో ఫెడరర్-నాదల్ జోడీ 6-4, 6-7, 9-11తో టీం వరల్డ్‌కు చెందిన టియాఫే-జాక్ సాక్ జంట చేతిలో ఓటమిపాలైంది. తన చివరి మ్యాచ్ తర్వాత కన్నీళ్లు పెట్టనని మ్యాచ్‌కు ముందు ఫెడరర్ చెప్పాడు. కానీ.. మ్యాచ్ అనంతరం తన కుటుంబ సభ్యులను చూసి ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయిన ఫెడరర్ కన్నీటి పర్యంతమయ్యాడు. భార్య మిర్కాను పట్టుకొని ఏడ్చేశాడు. ఇది చూసి నాదల్ కూడా విలపించాడు.

తల్లిదండ్రులు, భార్య ప్రోత్సాహంతోనే..
తాను ఇంతకాలం కెరీర్‌లో కొనసాగడానికి భార్య ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరర్ చెప్పాడు. గాయాల వల్ల ఎన్నోసార్లు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నానని.. తన భార్య ఇచ్చిన అండతోనే కొనసాగానని తెలిపాడు. తన తల్లిదండ్రులు లేకుంటే తానిక్కడ ఉండేవాడినే కాదన్నాడు. రాకెట్ పట్టకుండా ఎలా ఉండాలో అర్ధం కావడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఫెడరర్ మాట్లాడుతున్నప్పుడు అతడి తల్లిదండ్రులు, భార్య, నలుగురు పిల్లలు స్టాండ్స్‌లోనే ఉన్నారు. ఫెడరర్ మాట్లాడుతున్నత సేపు నాదల్‌తోపాటు నొవాక్ జకోవిచ్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

కేటీఆర్ అల్విదా..
తన కెరీర్‌లో 20 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు గెలుచుకున్న ఫెడరర్‌ను అతడి సహచరులు, ప్రత్యర్థులు ఎత్తుకొని మైదానంలో కలియ తిరిగారు. టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన ఫెడరర్‌కు ‘మీరు ఈరోజు ఏదైనా చూడగలిగితే..దీన్ని చూడాల్సిందే’ అంటూ మంత్రి కేటీఆర్ అల్విదా చెప్పారు. ఫెడరర్ ఇచ్చిన చివరి సందేశాన్ని లెవర్ కప్ తన వెబ్‌సైట్‌లో ట్వీట్ చేసింది. దాన్ని కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఇంతకాలం టెన్నిస్‌కు సేవలందించిన రోజర్‌కు థ్యాక్స్ చెప్పారు.