Andhra PradeshHome Page Slider

కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల

Share with

వైఎస్ షర్మిల, కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో షర్మిలతోపాటుగా ఆమె సోదరి సునీత, కాంగ్రెస్ కీలక నేత తులసి రెడ్డి పాల్గొన్నారు. ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. వైఎస్ షర్మిల రాజకీయ జీవితంలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 2014 ఎన్నికల సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ తర్వాత సోదరుడు జగన్మోహన్ రెడ్డితో విభేదాలతో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి.. రాష్ట్రమంతటా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కానీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పంపించింది. ఇప్పుడు ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేరుగా కొట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనతో ఏపీ అధ్వానంగా మారిందని ఆమె నిప్పులు చెరుగుతున్నారు. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె మరో సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డితో పోటీకి దిగుతున్నారు.