NewsTelangana

కేసీఆర్ బలం.. బలహీనత హరీశ్ రావేనా?

Share with

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారా? ఒకవేళ అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాతా? ఎన్నికలకు ముందేనా? రాష్ట్ర ప్రజల మనసుల్లో కొంత కాలంగా మెదులుగుతున్న ప్రశ్న ఇది. కాలికి గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్‌ ఇటీవల తన అభిమానులతో ట్విటర్‌లో నిర్వహించిన ఆస్క్‌ కేటీఆర్‌ అనే కార్యక్రమంలోనూ ఓ అభిమాని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మీరు సీఎం అభ్యర్థిగా ముందుకొస్తారా? అని అడిగాడు. దీనికి కేటీఆర్‌ సూటిగా సమాధానం ఇవ్వకుండా కేసీఆర్‌ మనకు సమర్ధుడైన సీఎంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఆయన హ్యాట్రిక్‌ సీఎం అవుతారు అని సర్దిచెప్పారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిచి కేసీఆర్‌ మూడోసారి సీఎం అయితే దక్షిణాదిలో హ్యాట్రిక్‌ కొట్టిన తొలి నాయకుడిగా నిలుస్తారని తెలిపారు. నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్‌ చేతిలో పెట్టి తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్‌ పకడ్బందీ వ్యూహం రూపొందించుకున్నారని ఇటీవలి పరిణామాలను బట్టి తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా? వద్దా అంటూ కేసీఆర్ ఇటీవల తెలంగాణ ప్రజలను పలుసార్లు ప్రశ్నించారు కూడా. భారతీయ రాష్ట్ర సమితి… బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి, జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసి, ఆ కూటమిని అధికారంలోకి తేవాలనే ఆలోచనతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల కేసీఆర్‌ నిర్వహించే విలేకరుల సమావేశాల్లోనూ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ.. జాతీయ సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తూ.. దేశ రాజకీయాల్లో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన నీతి ఆయోగ్‌, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశాలను బహిష్కరించారు కూడా. అంతేకాదు.. త్వరలో ఓ ఇంగ్లీషు టీవీ చానెల్‌ పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీన్ని బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కుమారుడు కేటీఆర్‌ చేతికి తెలంగాణాను అప్పగించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

హరీశ్‌.. తెలంగాణ ఏక్‌నాథ్‌ షిండే?

అయితే.. కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగిస్తే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి భగ్గుమంటుందేమోనన్న భయమూ కేసీఆర్‌ను పట్టి పీడిస్తోంది. అసంతృప్త టీఆర్‌ఎస్‌ నాయకులను తన వైపునకు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఓవైపు కాచుకొని ఉంది. యువకుడైన కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగిస్తే.. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అసమ్మతి గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ పసిగట్టింది. పైగా.. మహారాష్ట్రలో శివసేనను గద్దె దించిన ఏక్‌నాథ్‌ షిండే మాదిరిగా తెలంగాణాలోనూ పలువురు షిండేలు ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ పుట్టుక నుంచి పార్టీకి అండగా నిలిచిన కేసీఆర్‌ మేనల్లుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరో షిండే అవతారం ఎత్తినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హరీశ్‌రావు ప్రస్తుతానికి కేసీఆర్‌కు నమ్మిన బంటుగానే ఉన్నారు. తన స్థాయికి మంత్రి పదవి దొరకడమే గొప్ప అని.. మామ కేసీఆర్‌కు తాను కలలో కూడా వెన్నుపోటు పొడవబోనని హరీశ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చినా హరీశ్‌ నోరు మెదపలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రెండోసారి విజయం సాధించిన తర్వాత హరీశ్‌కు కేసీఆర్‌ మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆ సమయంలో హరీశ్‌ అసమ్మతి గళం వినిపిస్తాడేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పదవి ఇవ్వకున్నా హరీశ్‌ ఎక్కడా నోరు జారలేదు. కేసీఆర్‌పై అసంతృప్తి గళం ఏనాడూ వినిపించలేదు. పైగా.. పదవిలో ఉన్నప్పటి మాదిరిగానే పార్టీకి పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. హరీశ్‌ను కేసీఆర్‌ వాడుకొని వదిలేశారని విపక్షాలు ఎంతగా విమర్శించినా ఆయన మాత్రం స్పందించలేదు. కేసీఆర్‌పై విశ్వాసాన్ని సడలనీయలేదు. నిజానికి ఆ కాలం హరీశ్‌కు అగ్ని పరీక్షే. అయినప్పటికీ ఓపికతో తట్టుకొని నిలబడ్డారు. ఈ అగ్ని పరీక్షలో నెగ్గిన హరీశ్‌కు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్‌ సముచితంగా గౌరవించారు. ఇప్పుడు ఓ వైపు కేటీఆర్‌, మరోవైపు హరీశ్‌ అండతో టీఆర్‌ఎస్‌ పార్టీని కేసీఆర్‌ సునాయాసంగా నెట్టుకొస్తున్నారు.

ఎన్నికలకు ముందే ప్రకటిస్తే.. అసలుకే మోసం

కానీ.. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. కేటీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే మాత్రం పరిస్థితి అదుపు తప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనూ ఒక ఏక్‌నాథ్‌ షిండేను సృష్టించడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదు. మోడీ, అమిత్‌ షా వంటి ఉద్ధండుల ఎత్తుగడలను తట్టుకొని నిలబడటం కేసీఆర్‌కు కష్టమే. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిచినా కేసీఆర్‌ అనుకున్నట్లే అంతా జరుగుతుందని భావించలేం. అలా అని ఎన్నికలకు ముందే కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అసలుకే మోసం వస్తుంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుండా సీనియర్‌ నాయకులు అడ్డు తగిలే ప్రమాదమూ లేకపోలేదు.