కాంగ్రెస్ కంచుకోటలు అమేథీ, రాయ్‌బరేలీ బీటలు వారడానికి కారకులెవరు? (Exclusive)
కాంగ్రెస్ పార్టీ నేతలు చాన్నాళ్లూగా ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీపై హస్తం పార్టీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. 2014లో నరేంద్ర మోదీ మేనియాను తట్టుకొని రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2019లో ఆ పార్టీ అమేథీలో రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. కానీ, రాయ్‌బరేలీలో మాత్రం సోనియా గాంధీ విజయం సాధించారు. మొన్న అమేథీ, నేడు రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావిస్తుంటే, చరిత్రాత్మక సీట్లలో తిరిగి గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.

దేశంలో కాంగ్రెస్‌కు సురక్షితమైన స్థానాల్లో రాయ్‌బరేలీ ఒకటి. ఈ సీటుకు జరిగిన 20 ఎన్నికలలో, కాంగ్రెస్ 17 సార్లు విజయం సాధించింది. రాయ్‌బరేలీ సీటు కూడా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్టింగ్ ప్రధాని ఓటమిని చవిచూసిన ఏకైక పార్లమెంటరీ నియోజకవర్గంగా ఘనత సాధించింది. ఇందిరా గాంధీ భర్త, స్వాతంత్ర్య సమరయోధుడు ఫిరోజ్ గాంధీ మొదట ప్రాతినిధ్యం వహించారు. ఇందిరా గాంధీ మూడుసార్లు ఎన్నికయ్యారు. జూన్ 1975లో, ఎన్నికల దుర్వినియోగం కారణంగా 1971లో అలహాబాద్ హైకోర్టు… రాయ్‌బరేలీలో ఇందిరా గాంధీ సాధించిన విజయాన్ని రద్దు చేసింది. ఎమర్జెన్సీలో అధికార దుర్వినియోగంపై ఆరేళ్లపాటు ఏ పదవికి పోటీ చేయకుండా కోర్టు నిషేధం విధించింది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలలో, కాంగ్రెస్ కంచుకోటలో ఇందిరా గాంధీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఏకైక సిట్టింగ్ ప్రధానమంత్రిగా నిలిచారు. ఆ ఎన్నికలో ఇందిరా గాంధీని రాజ్‌నారాయణ్ జనాతా పార్టీ అభ్యర్థి ఓడించారు.

1980 ఎన్నికలలో ఇందిరా గాంధీ, ఇక్కడ్నుంచి తిరిగి గెలిచారు. ఆ తర్వాత సంవత్సరాల్లో, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన అరుణ్ నెహ్రూ ఈ స్థానం నుండి రెండుసార్లు ఎన్నికయ్యారు. 1996, 1998 ఎన్నికలలో బిజెపికి చెందిన అశోక్ సింగ్ రాయ్ బరేలీ నుండి గెలుపొందినప్పుడు కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. రెండు పర్యాయాలు కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారింది. 1999లో కాంగ్రెస్ తిరిగి రాయ్‌బరేలీని గెలుచుకోగలిగింది. సోనియా గాంధీ రాజ్యసభలోకి అడుగుపెట్టే ముందు 2004-2024 వరకు రెండు దశాబ్దాల పాటు ఇక్కడ విజయం సాధించారు. రాజ్యసభకు వెళ్లే ముందు రాయ్‌బరేలీ ప్రజలకు రాసిన భావోద్వేగ లేఖలో సోనియా గాంధీ ఇలా రాశారు. తన అత్తగారిని, జీవిత భాగస్వామిని శాశ్వతంగా కోల్పోయిన తరువాత, వచ్చిన తనకు మద్దుతిచ్చారని, క్లిష్ట పరిస్థితుల్లోనూ అండగా నిలిచారని కోనియాడారు. ఆ రోజులను తాను జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనన్నారు. నియోజకవర్గం తన కుటుంబానికి అండగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్న తరుణంలో ఆయన బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌తో పోటీ పడుతున్నారు.

అమేథీ: నాడు కుంచుకోడ.. మరి నేడు?
రాయ్‌బరేలీ వలె, అమేథీ సంవత్సరాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నలుగురు గాంధీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. 1967లో ఏర్పాటైన అమేథీ లోక్‌సభ స్థానానికి మొదట కాంగ్రెస్‌కు చెందిన విజద్య ధర్ బాజ్‌పాయ్ ప్రాతినిధ్యం వహించారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పుడు, సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేసినప్పుడు పార్టీ ఘోరంగా ఓటమిపాలయ్యింది. 1980 ఎన్నికలలో సంజయ్ గాంధీ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే వెంటనే విమాన ప్రమాదంలో మరణించడంతో అది ఖాళీ అయ్యింది. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో అమేథీ రాజీవ్ గాంధీని ఎన్నుకుంది. 1991లో అమేథీలో పోలింగ్ జరిగిన కొద్ది రోజులకే మాజీ ప్రధాని హత్యకు గురికావడంతో విషాదం నెలకొంది. అనంతరం ఓట్ల లెక్కింపులో ఆయన విజయం సాధించినట్లు తేలింది.

1999లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ భార్య, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. ఆమె తన కుమారుడు రాహుల్ కోసం 2004లో వరుసగా మూడుసార్లు గెలిచిన సీటును ఖాళీ చేశారు. 2019 ఎన్నికలలో, బిజెపికి చెందిన స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించారు. 50 వేల ఓట్లకు పైగా తేడాతో ఆమె రాహుల్ గాంధీని ఓడించారు. ఈసారి, రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బిజెపి అతన్ని “పారిపోయిన సైనికుడు” అని పిలిచింది. ప్రతిష్టాత్మక స్థానం నుండి స్మృతి ఇరానీని ఎదుర్కోవడానికి, కాంగ్రెస్ గతంలో రాయ్ బరేలీలో ఎంపీగా పనిచేసిన, అమేథీలో విస్తృతంగా పనిచేసిన గాంధీ కుటుంబానికి విధేయుడైన KL శర్మను ఎంపిక చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, శర్మ అంకితభావం, కర్తవ్య భావం కలిగిన వ్యక్తి అని, ఆయనను ఈ ఎన్నికల్లో కి తప్పకుండా విజయం సాధిస్తారన్నారు.

వారసత్వరాజకీయాలు
రాయ్‌బరేలీ, అమేథీలలో కాంగ్రెస్ తన అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించకముందే, ప్రియాంక గాంధీ ఒక స్థానం నుండి పోటీ చేయవచ్చని ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆమెను అమేథీ లేదా రాయ్ బరేలీ నుండి పోటీ చేయాలని అభ్యర్థించారు. అయితే ఆమె తిరస్కరించారు. ఆమె అయిష్టత వెనుక వారసత్వ రాజకీయాలపై విమర్శలొస్తాయన్న ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. ఓవైపు సోదరుడు రాహుల్ గాంధీ, మరోవైపు సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడం, ఇప్పుడు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే విమర్శలు రేగుతాయన్న ఆందోళనలో ప్రియాంక ఉన్నారు. వంశపారంపర్య రాజకీయాలపై బిజెపి ఆరోపణలను నిజం చేసినట్టవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో కీలక స్థానాల్లో విజయం సాధించడం ద్వారా, కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో భాగస్వామి కావాలనుకుంటోంది. ఇలాంటి తరుణంలో కుటుంబ కంచుకోటపై పట్టుసాధించాలనే ఆలోచన చేస్తోంది. అమేథీ పోటీలో రాహుల్ గాంధీ లేకపోవడం సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీకి అడ్వాంటేజ్ అవుతోందన్న ప్రచారం ఉంది.

