ఇజ్రాయెల్-పాలస్తీనాలలో ప్రపంచ దేశాలు ఎవరి పక్షం?
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడిని ఖండించిన దేశాలతో పాటు, ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేసిన హమాస్ ఉగ్రవాదులకు మద్దతు పలికే దేశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలలో తమ పక్షాన 84 దేశాలు తమకు అనుకూల ప్రకటనలు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అతలాకుతలం అవుతున్న శాంతిభద్రతల పరిస్థితి, ఇప్పుడు పెద్ద పెట్టున చెలరేగిన ఈ హింసాకాండలతో మరింత దిగజారాయి. అయితే కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా నిలువగా, మరికొన్ని పాలస్తీనాకు సపోర్టు చేస్తున్నాయి. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోననే భయాలు కూడా శాంతికాముకులను వెన్నాడుతున్నాయి.

ఇజ్రాయెల్‌కు ఇప్పటికే అమెరికా మద్దతు పలకడమే కాకుండా, తమ దేశం నుండి సైనిక సహాయంతో పాటు ఫైటర్ జెట్‌ను, యుద్ధ నౌకను కూడా పంపించింది. ఆ దేశ అధ్యక్షుడు బైడన్ ఇజ్రాయెల్‌కు సంపూర్ణమద్దతు తెలియజేశారు. ఎలాంటి సహాయానికైనా సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కూడా హమాస్ మిలిటెంట్ల దాడిని ఖండించారు. ఇజ్రాయిలీల రక్షణ కోసం, అవసరాలు తీర్చడం కోసం తమ దేశాల నుండి తగిన సహాయం అందుతుందని మాటిచ్చారు. భారత్ కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా భారత్ ఖండిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో భారతావని ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హమాస్ మెరుపు దాడిని ఆస్ట్రేలియా కూడా ఖండించింది. ఇంకా నార్వే, ఆస్ట్రియా, కెనడా, పోలండ్, స్పెయిన్, యూరోపియన్ యూనియన్లు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేశాయి.

మరోపక్క హమాస్‌ను వెనకేసుకొచ్చే దేశాలు లేకపోలేదు. ఇజ్రాయెల్ ప్రతిదాడిని విరమించుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా వీటిల్ ఇరాన్‌ను పేర్కొనవలసి వస్తుంది. యుద్ధం ప్రారంభం కాగానే హమాస్‌కు గట్టి మద్దతు తెలిపింది ఇరాన్. ఇజ్రాయెల్‌తో ఏమాత్రం సత్సంబంధాలు లేని ఇరాన్‌కు చెందిన హెజ్‌బొల్లా గ్రూప్ ఇప్పటికే లెబనాన్ వద్ద ఇజ్రాయెల్‌తో పోరాటం చేస్తోంది. ఇరాన్‌తో పాటు దక్షిణాఫ్రికా, యెమెన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, లెబనాన్ వంటి దేశాలు కూడా ఈ ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నాయి.