మానవత్వం మంటగలిసిన వేళ..!
ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం రెండు రోజుల నుంచి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పైనే ఉంది. అందరూ చూసి వెళ్లిపోతున్నారే తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. దోమలు, ఈగలు వాలుతున్నా.. ఎండలో మగ్గిపోతున్నా కనీసం ఒక దుప్పటి కప్పేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అలాగే వదిలేశారు. అధికారులు సైతం బాధ్యత మాది కాదంటే మాది కాదని తప్పించుకున్నారే తప్ప దహన సంస్కారాలు చేసేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. ఈ అమానవీయ ఘటన ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ఆవరణల చోటు చేసుకుంది.
రైల్వే స్టేషన్ ఆవరణలోని ఫట్‌పాత్‌పై శనివారం గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. అదేదారిలో నిత్యం ప్రయాణికులు, రైల్వే పోలీసులు సంచరిస్తున్నప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయమై రైల్వే జీఆర్‌పీ పోలీసులను వివరణ కోరగా స్టేషన్ లోపల, ట్రాక్‌పై చనిపోతేనే తమ పరిధిలోకి వస్తుందని.. స్థానిక పోలీసులే చూడాలని బదులిచ్చారు. స్థానిక ఎస్‌ఐ కృష్ణ మాట్లాడుతూ రైల్వేస్టేషన్ ఆవరణ తమ పరిధి కాదని.. రైల్వే పోలీసులే చూసుకుంటారని చెప్పారు. అనాథ మృతదేహాన్ని ఇలాగే వదిలేస్తారా.. ఇదేనా మానవత్వం.. అంటూ కొందరు బహిరంగంగానే అధికారుల తీరుపై మండి పడుతున్నారు.