పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ల పనులను శరవేగంతో పూర్తి చేస్తాం
ఎస్. ఎల్.బి.సి టన్నెల్ పూర్తికి ప్రభుత్వం సన్నద్ధమౌతుందని రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై శరవేగంగా పనులు పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజు మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లతో కలసి నల్లగొండ-నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మన్నెంవారి పల్లెలో ఎస్. ఎల్.బి.సి టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ-ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజాప్రతినిధులతో టన్నెల్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ల పనులను శరవేగంతో త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన వెల్లడించారు. పదేళ్ల కేసీఆర్ పాలన నిర్వహకమే ఎస్.ఎల్.బి.సి పూర్తి కాకపోవడానికి కారణమైందని ఆయన ఆరోపించారు. సవరించిన అంచనాల ప్రకారం పనులు పూర్తి చేస్తే 3,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయి ఉండేదని ఆయన అన్నారు. ఉచితంగా శ్రీశైలం నుండి గ్రావిటీ ద్వారా పూర్తయ్యే దీనిని వదిలి పెట్టి ఎత్తిపోతలు అంటూ కాళేశ్వరం మీద లక్ష కోట్లు,సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కు పదివేల కోట్లు,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు అంటూ 25 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అదే 3,500 కోట్లు ఖర్చు పెట్టి ఎస్.ఎల్.బి.సిని పూర్తి చేసినట్లయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవన్నారు.
అంతే గాకుండా 700 పై చిలుకు గ్రామాలకు సురక్షిత త్రాగునీరు అందేదని ఆయన తెలిపారు. అటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ను ఎందుకు కేసీఆర్ విస్మరించారు అన్నది ఇప్పటికీ భోద పడడం లేదన్నారు. ఎస్.ఎల్.బి.సి ని పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని…సరిపడా నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.