యాపిల్ టాప్-15లో విశాఖ కుర్రాడు
యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో విశాఖకు చెందిన గీతం డీమ్డ్ వర్సిటీ సీఎస్ఈ విద్యార్థి మానస్ మల్ల సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్-15 ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా మానస్ చరిత్ర సృష్టించాడు. అంతేకాక జూన్ 9న అమెరికాలో జరిగే ‘యాపిల్ ప్రపంచస్థాయి డెవలపర్స్ సదస్సు’కు మానస్ ఎంపికయ్యాడు. అక్కడ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో నేరుగా ముఖాముఖిలో పాల్గొననున్నాడు. బట్టీపట్టే చదువుల వల్ల విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కృత్రిమ మేధ (AI), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సాంకేతికతతో ‘స్టెమ్‌క్వెస్ట్’ అనే ఆఫ్ లైన్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ ను రూపొందించాడు. ఈ యాప్ ఫేషియల్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థుల ముఖ కవళికలను చూసి, వారు అయోమయంలో ఉన్నా లేదా ఆసక్తిగా లేకపోయినా వెంటనే గ్రహిస్తుంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా స్థానిక భాషల్లో స్నేహపూర్వకంగా బోధిస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్, వినికిడి మరియు దృష్టిలోపం ఉన్న వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఒక మిత్రుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మానస్ ను తీవ్రంగా కలచివేసింది. దీనితో చిన్నతనంలో తాను అమెరికాలో చదువుకున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేలా ఈ వినూత్న యాప్ ను రూపొందించాడు. ప్రపంచవ్యాప్త పోటీలో నిలిచి, యాపిల్ టాప్-15 జాబితాలో ఏకైక భారతీయుడిగా నిలిచిన మానస్ మల్లపై ఇప్పుడు నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.

