Home Page SliderNational

వినేశ్ అనర్హతపై రాజ్యసభలో దుమారం.

Share with

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ వరకూ పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటుపై రాజ్యసభలో దుమారం రేగింది. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలంటూ విపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. దీనికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నిరాకరించారు. ఈ విషయంపై చర్చ జరిగితే వినేశ్‌ను అవమానించినట్లేనని ఛైర్మన్ పేర్కొన్నారు. దీనితో ప్రతిపక్ష ఎంపీలు సభ నుండి వాకౌట్ చేశారు. విపక్షాల తీరుపై ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. వినేశ్ పరిస్థితిపై దేశం మొత్తం బాధపడుతోందని, దీనిని రాజకీయం చేస్తే ఆమెను అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ వినేశ్‌కు దేశం మొత్తం అండగా ఉందని, ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్ అని ప్రధాని మోదీ కూడా నిన్న పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని నడ్డా వివరించారు. కేంద్ర ప్రభుత్వం, క్రీడాశాఖ, భారత ఒలింపిక్ మండలి దీనికోసం చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, కేంద్రం దీనిపై ఎందుకు మౌనం వహించిందని ప్రశ్నించారు. వినేశ్ చేజారిన పతకం యావత్ భారతానిదే అని, దీనిపై భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో మాట్లాడాలని, బాధ్యత వహించాలని విమర్శించారు.