ఎన్నారైల నెత్తిన ‘ట్రంప్’ పిడుగు
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై మరో భారం పడనుంది. అధ్యక్షుడు ట్రంప్ సర్కారు కొత్తగా ఎన్నారైలకు మరో ట్యాక్స్ విధించనున్నారు. ఇతర దేశాలకు అమెరికా నుండి డబ్బు పంపడంపై 5 శాతం పన్ను విధించాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును కూడా తాజాగా ‘అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్’లో ప్రవేశపెట్టారు. ఈ ట్యాక్స్ నుండి అమెరికాలో పుట్టినవారికి తప్ప ఎలాంటి వీసాలు, గ్రీన్ కార్డులున్నవారికి కూడా మినహాయింపులు లేవు. అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై ఈ ట్యాక్స్ వల్ల ప్రవాస భారతీయుల నెత్తిన పిడుగు పడినట్లే. ఎందుకంటే వారు పంపించే ప్రతీ లక్ష రూపాయలకు రూ. 5 వేల ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అక్కడ డబ్బు సంపాదించుకుని తమ దేశాలలోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుంది. ముఖ్యంగా భారత్‌కు దీనివల్ల భారీ నష్టం ఉంటుంది. ఈ బిల్లు ప్రభావం సుమారు 45 లక్షలమంది ఎన్నారైలపై పడనుంది. ప్రస్తుతం అమెరికా నుండి ఏటా 8 వేల కోట్ల డాలర్ల వరకూ తమ కుటుంబాలకు పంపుతున్నారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ విధించడం వల్ల యూఎస్‌కి బిలియన్ల కొద్దీ ఆదాయం సమకూరుతుంది. దీనిని పన్ను విరామ కాలంలో నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.