మునుగోడుపై గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లు
మునుగోడు సెగలు కక్కుతోంది. అన్ని పార్టీలలో అసమ్మతి భగ్గు మంటోంది. టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయనకు టికెట్ కేటాయిస్తే సహాయ నిరాకరణ తప్పదంటూ అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో జరిగిన ఓ సమావేశంలో అసమ్మతి నేతలు గళం విప్పారు. సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభాకరరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిణామాలే ఏర్పడ్డాయని .. అప్పుడు పోటీ చేసి ఓడి పోవడానికి ఆయన అనుసరించిన విధానాలే కారణమని అసమ్మతి నేతలు అంటున్నారు. కింది స్ధాయి నుండి ఆయనంటే తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే పార్టీ ఓటమి తధ్యం అంటూ తెగేసి చెబుతున్నారు. ప్రభాకరరెడ్డికి తప్పించి మరెవరికి టికెట్ ఇచ్చినా తామంతా కలిసి కట్టుగా పని చేసి గెలిపించుకుంటామని టీఆర్ఎస్ అసమ్మతి నేతలు చెబుతున్నారు. దండుమల్కాపురంలో చేసిన సమావేశం తీర్మానాలు పార్టీ అధిష్టానానికి పంపనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని నారాయణపూర్, చౌటుప్పల్, నాంపల్లి మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.