“జల్ సంచయ్” ముఖ్యఉద్దేశం అదే..ప్రధాని మోదీ
భవిష్యత్ తరాలకు నీరు అందివ్వడం మన బాధ్యతగా భావించాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. నీటిని నిల్వచేయడం, ప్రభుత్వ విధానమే కాకుండా పుణ్యకార్యమన్నారు. గుజరాత్‌లోని “జల్ సంచయ్- జన్ భాగీదారీ మిషన్”ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ మిషన్ ముఖ్యఉద్దేశం నీటిని సంరక్షించడం ద్వారా నీటి భద్రతను పెంచడమే అన్నారు. తమ ప్రభుత్వం జల భద్రతకు కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్ తరాలు మన విలువను గుర్తించాలంటే జల సంరక్షణ మనందరి ముఖ్య ధ్యేయం కావాలన్నారు. దీనిలో ఉదారత, బాధ్యతలున్నాయని పేర్కొన్నారు. నీరు లేకపోతే మానవ మనుగడ లేదని జలమే సకల ప్రాణులకు ప్రాణాధారమని హితవు చెప్పారు. భారత్‌లో ఎన్నోనదులు, సహజ వనరులు ఉన్నాయని, వాటిని కాపాడుకుంటూ భావి తరాలకు బంగారు బాట వేయాలని పేర్కొన్నారు.
స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. “జల్ జీవన్ మిషన్” ద్వారా లక్ష ప్రీమెచ్యూర్ మరణాలను అరికట్టవచ్చన్నారు. ప్రతీ సంవత్సరం 4లక్షల మంది ప్రజలు కలుషిత త్రాగునీరు కారణంగా డయేరియా వంటి వ్యాధులతో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మిషన్ వల్ల ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయని, సురక్షితమైన నీరు ప్రజలకు అందుతుందని పేర్కొన్నారు. గతంలో దేశవ్యాప్తంగా కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే పరిశుద్ధ త్రాగునీటి పైపులైన్లు ఉంటే నేడు 15 కోట్లకు పైచిలుకు గ్రామాలలోని ఇళ్లకు త్రాగునీటి పైపులైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన త్రాగునీరు దేశం మొత్తం 75 శాతం మందికి అందుబాటులోకి వచ్చిందన్నారు.

