పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి- ఆర్ కృష్ణయ్య
వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఈ నెలలో ప్రధానిని కలుస్తామని వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు .

కేంద్రంలో 72 మంత్రిత్వశాఖలు ఉన్నప్పుడు 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తే తప్పు ఏంటని కృష్ణయ్య ప్రశ్నించారు. మండల కమీషన్ సిఫార్సులు అమలు చేయడానికి, బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరం ఉందన్నారు. పలు రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో లేకపోవడం శోచనీయం అని అన్నారు కృష్ణయ్య. 1992 లోనే సుప్రీంకోర్టు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిన అవసరం ఉందని సూచించిందని కృష్ణయ్య గుర్తుచేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ తరపున ఒత్తిడి తెస్తామన్నారు.వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ ఒక ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్సార్ పార్టీ బీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం కృషి చేస్తూన్నమని వెల్లడించారు. అంబేద్కర్ , జ్యోతిరావు పూలే ఆశయ సాధనకోసం జనగణన జరగాలి, చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని వైఎస్ఆర్ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.

దేశంలో బీసీల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, 9 రాజ్యసభ సభ్యులలో 4 పదవులు, రాష్ట్రమంత్రి వర్గంలో పది మంత్రి పదవులు , కార్పోరేషన్ పదవులు ఇచ్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు కృష్ణయ్య. మాటల్లో కాకుండా ఆచరణలో బీసీల సంక్షేమం కోసం ఏపి సీఎం జగన్ కృషిచేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా …ఒక తత్వవేత్తగా, సిద్ధాంత వేత్తగా జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏపి లో జగన్ చేస్తున్న కృషిని చూసి పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు ఆశ్చర్యపోతున్నారని కృష్ణయ్య తెలిపారు. కేంద్ర స్థాయి ఉద్యోగాల్లో , సుప్రీంకోర్టు , హైకోర్టు జడ్జిల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరతామన్నారు.కేంద్ర బడ్జెట్ లో బీసీలకు 1400 కోట్లు కేటాయించడం సిగ్గు చేటు. కనీసం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.