జమ్మూ,కాశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు
జమ్మూకాశ్మీర్‌లో ఈమధ్య కాలంలో వరుసగా దాడులతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. స్థానికులను బెంబేలెత్తిస్తున్నారు. గత మూడురోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఉగ్రదాడులు జరిగాయి. భద్రతా బాలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా అమరుడయ్యాడు. ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. ఆదివారం జరిగిన పర్యాటక బస్సుపై దాడులలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతలోనే మంగళవారం కథువా జిల్లాలోని హీరానగర్‌లో ఒక ఇంటిపై దాడులు చేసి యజమానిని గాయాల పాలు చేశారు. ఈ ఆపరేషన్‌లోనే ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరు తప్పించుకోగా, డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఇంటిపై దాడులు చేయడానికి ముందు పలు ఇళ్లకు వెళ్లి ఉగ్రవాదులు నీరు అడిగినట్లు సమాచారం. గతంలో ఉగ్రఘటనలు తక్కువగా ఉన్న ఈ ప్రాంతాలలో ఉగ్రవాదుల సంచారం ఆందోళన కలిగిస్తోంది.