Andhra PradeshHome Page Slider

కౌలు రైతు దంపతుల ఆత్మహత్య

Share with

వరుసగా రెండేళ్లు కాళేశ్వరం వెనుక జలాల్లో పంటలు నీటమునిగి, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మంథని గ్రామీణం: వరుసగా రెండేళ్లు కాళేశ్వరం వెనుక జలాల్లో పంటలు నీటమునిగి, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లామంథని మండలం ఎక్లాస్‌పూర్ పంచాయతీ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. 5 సంవత్సరాల లోపు ఉన్న వీరి ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఎక్లాస్‌పూర్ పంచాయతీ నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ (35)కు భార్య సంగీత (28), అయిదేళ్ల లోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అశోక్ కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి (అన్నారం) రిజర్వాయర్ వెనుక వైపు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేస్తున్నారు. 2021, 2022 సంవత్సరాల్లో ఈ పొలాలు ప్రాజెక్టు వెనుక జలాలతో మునిగిపోయాయి. పంటలు చేతికందకపోగా, పెట్టుబడి నష్టపోయారు. ఈ ఏడాది సైతం పంటలు సాగు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో కొద్ది రోజులుగా అశోక్ దంపతులు మనోవేదనకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఇంట్లో మృతి చెందిఉన్న వీరిని చుట్టుపక్కలవారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి పిల్లలు నిద్రపోయాక దంపతులు పురుగుల మందు తాగినట్లుగా గుర్తించారు. అశోక్‌కు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. సంగీత తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు మంథని ఎస్‌ఐ కిరణ్ తెలిపారు.