న్యాయానికి సంకెళ్లంటూ టీడీపీ నిరసన
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది టీడీపీ. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ‘న్యాయానికి సంకెళ్లు’ అనే పేరుతో ఈ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ నియంతృత్వ పోకడలను దేశానికంతా తెలిసేలా చేయాలని కోరారు. దీనికోసం ఈ ఆదివారం రాత్రి 7 గంటల నుండి ఐదు నిముషాల పాటు చేతులకు తాడు లేదా రిబ్బన్ కట్టుకుని నిరసన తెలియజేయాలంటూ ట్వీట్ చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని, చంద్రబాబు ధర్మపోరాటానికి మద్దతుగా నిలవమని అభిమానులను, పార్టీ శ్రేణులను కోరారు లోకేష్. నేడు చంద్రబాబును జైల్లో ఆయన భార్య భువనేశ్వరి కలిసిన సంగతి తెలిసిందే. ఆయనను కలిసిన తర్వాత ఆమె తీవ్రవిచారానికి లోనయ్యారని, ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురయ్యారని పార్టీ వర్గాలు తెలియజేశారు. అందుకే ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆయన బరువు తగ్గారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంపై జైళ్ల శాఖ మీడియా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది.