వరుసగా బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టులు
హైదరాబాద్‌లో వరుసగా బీఅర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన సందర్భంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు అయ్యారు. కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు, కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ మంత్రి తలసాని యాదవ్ హౌస్ అరెస్టులు జరిగాయి. వీరందరి ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనపై హరీష్ రావు పోలీసులతో వాగ్వాదం చేసి, బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. చేయి నొప్పని, డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్పగా పోలీసులు అనుమతించలేదు. దీనితో హరీష్ రావు ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయనను కలిసేందుకు బీఆర్‌ఎస్ నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత, క్రాంతికిరణ్ వచ్చారు. వారిని అడ్డుకున్న పోలీసులు సీపీ అనుమతి తీసుకోవాలని, లోనికి అనుమతించలేమని పేర్కొన్నారు. దీనితో ఇంటి బయటే బైఠాయించి, నినాదాలు మొదలుపెట్టారు.
ఈ సంఘటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీటింగులు పెట్టుకునే హక్కులు కూడా మా పార్టీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని, దాడులు చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి, బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు. సీఎం చేస్తున్న అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన విధంగా బుద్ది చెప్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.