చంద్రబాబు ఆరోగ్యంగా బయటపడాలని ప్రత్యేక పూజలు
నాగాయలంక: చంద్రబాబు జైల్లో అనారోగ్యంతో బాధపడుతుంటే మంత్రులు, వైకాపా నాయకులు మానవత్వం లేని మృగాల్లా మాట్లాడుతున్నారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడమే కాక, ఆయన అనారోగ్యంపై అవాకులు చవాకులు మాట్లాడుతూ వైకాపా నేతలు రాక్షసానందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు విడుదల కావాలని కాంక్షిస్తూ ఆదివారం స్థానిక తలశిల వారి గంగానమ్మ ఆలయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తలశిల వెంకట నరసింహారావు (నాని), చంద్ర వెంకటేశ్వరరావు, తలశిల శ్రీనివాసరావు, ఉప్పల ప్రసాద్, తలశిల శివరామకృష్ణ, లకనం నాగాంజనేయులు, లంకే శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయానికి సంకెళ్లు వేసి కక్షసాధిస్తున్న సీఎం
కోడూరు (అవనిగడ్డ): న్యాయానికి సంకెళ్లు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. ఆదివారం మండల పరిధి విశ్వనాథపల్లి కూడలిలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జనసేన నాయకులు సంఘీభావం ప్రకటించారు.