సిసోడియాను వాదనలు లేకుండా ఎన్నాళ్లు జైల్లో ఉంచాలి…సీబీఐ, ఈడీకి సుప్రీం ప్రశ్నలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన మనీష్ సిసోదియాను ట్రయల్ కోర్టులో వాదనలు లేకుండా ఎన్నిరోజులు జైల్లో ఉంచాలంటూ సీబీఐ, ఈడీలను సుప్రీం ప్రశ్నించింది. ఆయనను నిరవధికంగా జైల్లో ఉంచలేరంటూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ప్రశ్నించింది. అభియోగం దాఖలు చేసిన వెంటనే వాదనలు మొదలవ్వాలని, అలా ఎందుకు జరగలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్. వి.భట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిసోదియా ఫిబ్రవరి 26 న అరెస్టయ్యారు. ఇన్ని నెలలుగా కేసులో పురోగతి లేదని, వాదనలు ప్రారంభం కాలేదని త్వరలో విచారణ ప్రారంభించాలని ఈడి,సీబీఐని ఆదేశించింది ధర్మాసనం. సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు మాట్లాడుతూ 18 శాఖలు చూస్తున్న ఉపముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవినీతికి పాల్పడితే ఇలాంటి శిక్ష ఉండాలన్నారు. పైగా ఈ కేసులో వాట్సాప్ ఛాటింగులు దొరికాయని, రుజువులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కేసులో అప్‌ను కూడా చేర్చాలని భావిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేశారు. మద్యం విధానాన్ని మార్చడం వల్ల కొంతమందికి లబ్ధి కలిగి, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని వారు వాదించారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

