సిగ్గుతో తలదించుకోవాలి… కేటీఆర్ వ్యాఖ్యలపై నిరుద్యోగుల ఆగ్రహం
పరీక్షల నిర్వహణలో అవుతున్న జాప్యంతో ప్రవళిక ప్రాణాలు తీసుకున్నా.. ఆమె ప్రేమ వ్యవహారమంటూ అటు పోలీసులు చెప్పడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బిడ్డ విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని అనుకోలేదని మండిపడుతున్నారు. తాజాగా టీవీ డిబేట్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. దీనిపై చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. సూసైడ్‌పై చర్చ జరిగి వాట్సాప్ చాట్ బయటకు వస్తే అమ్మాయి కుటుంబ పరువు పోతుందంటూ వ్యాఖ్యానించడంపై ఇప్పుడు బడుగు బలహీనవర్గాలు మండిపడుతున్నాయ్. ప్రవళిక గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న డాక్యుమెంట్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు చెబుతున్నట్టుగానే మంత్రి కేటీఆర్ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం ఏంటన్న భావన వ్యక్తమవుతోంది. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ ఆఖరికి మన బిడ్డల ఉసురు తీస్తోంది. పూర్తి స్థాయి విచారణ లేకుండా ప్రవళిక గురించి మాట్లాడటం దారుణమంటున్నారు నిరుద్యోగులు. కుటుంబ సభ్యులు సైతం మంత్రి వ్యాఖ్యలపై గుస్సాగా ఉన్నారు. తమ బిడ్డపై ఇలాంటి విమర్శలు చేయడం దారుణమన్నారు. మొత్తం కేసీఆర్ సర్కారు ఉద్యోగాల నోటిఫికేషన్ల మాయతో నిరుద్యోగుల ప్రాణాలను బలిగొంటోంది. వేలకు వేల రూపాయలు అప్పులు తెచ్చి, హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో.. అసలు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో.. నిర్వహిస్తే ఎలా జరుగుతాయో.. అసలు జరిగినా అర్హులకు ఉద్యోగాలు వస్తాయో రావోనన్న టెన్షన్‌లో కంగారుపడుతున్నారు. ఇదే నిరుద్యోగుల పాలిట శాపాలవుతున్నాయ్.
ఇప్పటికే తెలంగాణలో ఎందరో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంలో జాప్యం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఎన్నికలు, ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాక మరోసారి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తెగువ తెలంగాణ సమాజానిది.. ఆత్మహత్యలతో సాధించేదేం లేదని అర్థం చేసుకోవాలి. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ నిరుద్యోగ యువతను అవమానాల పాల్జేస్తున్న పొలిటికల్ లీడర్ల భరతం పట్టేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తగిన వేదిక.