ఇందిరమ్మ ఎమర్జెన్సీ కన్నా దారుణం రేవంత్ పాలన
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న పాలన ‘ఇందిరమ్మ కాలం’ నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తుందనీ, రాజకీయ కక్ష సాధింపుతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వ దురుద్దేశపూరిత ధోరణిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ చర్యలు బీఆర్‌ఎస్ నాయకుల ధైర్యాన్ని తగ్గించలేవని స్పష్టం చేస్తూ, ప్రజల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.