Home Page SliderNational

పెళ్లిళ్ల కారణంగా రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్పు

Share with

రాజస్థాన్ ఎన్నికల తేదీలో రాష్ట్రంలో పెళ్లిళ్ల కారణంగా మార్పు జరిగింది. నవంబర్ 23న జరగవలసిన ఎన్నికలు ఆ రాష్ట్రంలో నవంబర్ 25న జరుగనున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుండి రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఆందోళనగానే ఉన్నాయి. ఎందుకంటే పోలింగ్ జరిగే నవంబర్ 23 వ తేదీన వారి పర్వదినమైన దేవ్ ఉథాని ఏకాదశి. దీనితో ఆరోజు దాదాపు 50 వేల పైచిలుకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీనితో పోలింగ్ శాతం విపరీతంగా పడిపోవచ్చని అభ్యర్థులు ఆందోళన చెందారు. హిందువులలో అన్ని కులాల వారికీ ఈ రోజు పరమ పవిత్రంగా భావిస్తారు.

పెళ్లి అంటే మాటలా అనేక వృత్తుల వారు పెళ్లి పనుల్లో నిమిత్తమై ఉంటారు. వంటవాళ్లు క్యాటరర్లు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్లు, పురోహితులు, డ్యాన్సర్లు, అలంకరణ పనుల వారు, పనివాళ్లు ఇలా అందరూ బిజీగా ఉంటారు. వేరే ఊర్లో పెళ్లిళ్లయితే ఊర్లకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పెళ్లి మండపాలు బుక్ అయ్యాయని, వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని ప్రముఖ ఈవెంట్ మేనేజర్ తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలలో ఓటు విషయంలో చైతన్యం ఉందని ఓటింగ్ శాతానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడవచ్చని ఎన్నికల కమీషన్ తొలుత భావించినా చివరికి రాజకీయ పార్టీల ఒత్తిడితో దిగిరాక తప్పలేదు. ప్రజలకు ఓటు హక్కును దూరం చేయకూడదనే ఉద్దేశంతో ఎన్నికలను రెండ్రోజులు వాయిదా వేశారు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.