బటన్ నొక్కి పింఛన్లను ఇవ్వండన్న రఘురామ
ఏపీ అప్పుల గురించి ప్రధాన మంత్రికి గతంలోనే లేఖ రాశానన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. బ్యాంకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నాయన్నారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేస్తున్నారని… కలెక్టర్,ఎమ్మార్వో కార్యాలయలను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారంటూ విమర్శించారు. బ్యాంకుల తీరుపై ఆర్బీఐకి మరోసారి లేఖ రాస్తానన్నారు. పథకాలన్నింటినీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అందిస్తున్నప్పుడు పింఛన్లు ఎందుకు వాలంటీర్ల ద్వారా ఇస్తారని ఆక్షేపించారు రఘురామ. వాలంటీర్ల లేకుండా పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీ ఓట్ల కొనుగోలు కిందికి వస్తుందన్నారు. డైరెక్ట్‌గా బటన్ నొక్కితే నేరుగా అకౌంట్లోకి వెళ్తాయని… జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు రఘురామకృష్ణరాజు. గతంలో అన్నదాత సుఖీభవ అని ఉంటే.. ఆ పథకానికి పేరు మార్చి వైఎస్సార్ రైతు భరోసా అంటూ ఎద్దేవా చేశారు. పథకం తమ గొప్పని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. ఇక ఎంపీ భరత్ ఎలా ఉండాలో తనను చూసి నేర్చుకోవాలన్నారు. అనవసరమైన రచ్చ అక్కర్లేదన్నారు. జీపీఎఫ్ డబ్బులు… 800 వందల కోట్లు పొరపాటున బటన్ నొక్కితే వెళ్లాయని చెప్పారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రఘురామ.
