ఏపి బిజెపి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతున్న పురంధరేశ్వరి
ఏపి బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారని ఏపీ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు. రేపు ఉదయం 9.30 గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారని, అనంతరం భారీ ర్యాలీగా విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారన్నారు. ఉదయం 11 గంటలకి పురంధరేశ్వరికి మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పూర్తిస్ధాయి బాధ్యతలు అప్పగిస్తారు. 12 గంటలకి వెన్యూ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ సహ ఇన్‌ఛార్జి సునీల్ ధియోధర్, సోము వీర్రాజు, మాజీ సిఎంకిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, ఎంపి సిఎం రమేష్, జీవీఎల్ తదితరులు పాల్గొంటారని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో పురంధరేశ్వరి నేతృత్వంలో బిజెపి ముందుకు వెళ్తుందని తెలియజేశారు. ఏపి ప్రజలు బీజేపీ వైపే ఉంటారనే నమ్మకముందన్నారు.

ఈ నెల 16 న విజయవాడలో జిల్లా అద్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం..రాబోయే పది నెలల కార్యాచరణపై చర్చిస్తాం . విభజన చట్టంప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, విద్య, వైద్య అంశాలలో సమాన హక్కులున్నాయని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏపీలోని వైద్య విద్యార్ధులకి నష్టంకలిగేలా జిఓ నంబర్ 72 తీసుకువచ్చిందని మండిపడ్డారు. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో పూర్తిగా తెలంగాణా విద్యార్ధులకి అవకాశమిస్తూ ఇచ్చిన ఈ చీకటి జిఓని వెనక్కి తీసుకోవాలని ఏపీ విద్యార్థుల తరపున పోరాటం చేస్తామన్నారు. ఏపి, తెలంగాణా రాష్ట్ర సీఎంల మద్య చీకటి ఒప్పందం ఉందని, అందుకే విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ సెక్రటేరియట్ ని తెలంగాణాకి పూర్తిగా అప్పగించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కి జాతీయ పార్టీ అయ్యే అర్హత లేదని, ఆంధ్రాకి అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రకి కూడా అన్యాయం చేస్తుందని, వైద్య విద్యార్థుల విషయంలో కేసీఆర్, వైద్య శాఖ మంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

