NewsTelangana

కార్గిల్ త్యాగాలు మరువలేం-పవన్‌కళ్యాణ్

Share with

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్గిల్ విజయ్ దివస్‌ను పునస్కరించుకుని సైనికుల ధైర్యసాహసాల గురించి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు. 1999 జులై 26న భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి కార్గిల్ కొండలపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారని… ఆ రోజును మరువలేమన్నారు. అయితే ఈ విజయ సాధనలో 527 మంది సైనికులు వీర మరణం పొందడం గుండెలను పిండేసే సంఘటన అని బాధపడ్డారు. . ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించిన భారత సైనికులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని, వారి ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నానని ఉద్వేగంతో ప్రసంగించారు. ఈరోజు భారత సైనికుల ధైర్య సాహసాలు , వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపడిన రోజని, సైనికుల వీరుల త్యాగాల ఫలితమే కార్గిల్ విజయం అనీ, అందుకే మనం కార్గిల్ విజయ్ దివస్  జరుపుకుంటున్నామని అన్నారు.

శరీరాన్ని కొరికే చలిలో   ప్రతికూల పరిస్థితులు , ప్రతికూల వాతావరణంలో శత్రువులకు ఎదురెళ్లితే ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసినా  దేశం కోసం , కోట్లాది మంది ప్రజల భద్రత కోసం శత్రు మూకలతో పోరాడి మన దేశ భూభాగాన్ని రక్షించిన వారి త్యాగాన్ని మనం ఎంత కీర్తించినా , మరెంత పొగిడినా తక్కువేనన్నారు పవన్ కల్యాణ్. శత్రువులను దేశం నుండి తరిమేయడానికి భారత సైనికులు చూపిన తెగువ , పోరాటం గురించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని, వారి త్యాగాన్ని గుర్తు పెట్టుకుని నివాళులు సమర్పించాలన్నారు. ఈ విజయ భేరిలో నినదించిన ప్రతి సైనికులకు… వారి కుటుంబాలకు భారత జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని… అమరుల త్యాగాలను స్మరించుకుంటూనే ఉంటుందన్నారు పవన్ కల్యాణ్.