ఎన్నికల ముందే రైతులకు ప్రధాని మోదీ కానుక
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రైతులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని పెంచబోతున్నారు. దీనిని మరో రెండువేలు పెంచి ఎనిమిది వేల రూపాయల సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలలో జమచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఇస్తున్న ఈ పెట్టుబడి మొత్తాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ కార్యక్రమానికి రూ. 60 వేల కోట్లు కేటాయించారు. ఇది ఆమోదం పొందితే ప్రభుత్వంపై రూ. 20 వేల కోట్లు భారం పడబోతోంది. ఈ పథకం వల్ల దేశంలోని చిన్న రైతులకు, కౌలు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే పలు రైతు సంక్షేమ చర్యలను చేపట్టింది కేంద్రప్రభుత్వం. ఉచిత ధాన్యాల కార్యక్రమాన్ని మరో ఏడాది పొడిగించారు. చిన్న పట్టణాలలో గృహరుణాల కోసం సబ్సిడీలు ఇస్తున్నారు. ఇటీవలే గ్యాస్ సిలెండర్ ధరలో కూడా సబ్సిడీని తిరిగి ప్రారంభించారు.