NationalNews

అధికారం ఉంది కదా అనీ నిర్ణయాలు తీసుకుంటే ఇట్లుంటది…

అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు… ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చనుకునేవారికి చెంపపెట్టు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వ్యవహారం. ప్రభుత్వ కాంట్రాక్టును తనకు తానుగా ఇచ్చుకోవడం… అనర్హత వేటు కిందకు వస్తోందని ఈసీ తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తోంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం, ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాల్సిందేనని ఎన్నికల సంఘం గవర్నర్‌కు స్పష్టం చేయడంతో… ఒక్కసారిగా జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయ్. మొత్తం వ్యవహారంపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ అనర్హుడంటూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేసిన మరుక్షణం సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయనతోపాటు కేబినెట్ సహచరులంతా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఆరు నెలల్లోగా ఉపఎన్నికలు జరిగితే ఆయన తిరిగి ఎన్నికయ్యేందుకు అవకాశం కూడా ఉంది.

ఐతే తనకు పదవులపై తనకు ఆశలేదంటూ కామెంట్ చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ప్రజా సంక్షేమం కోసం తాము వ్యవస్థలను ఉపయోగించుకుంటుంటే.. ప్రత్యర్థులు రాజకీయంగా విఫలమై… రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వ్యవహారశైలిపై ఆందోళన అక్కర్లేదన్న ఆయన… ప్రజలు అధికారం అప్పగించారని… ఇచ్చిన అవకాశం మేరకు పనిచేశామన్నారు. బీజేపీ ఏం చేయాలనుకుంటుందో చేయనివ్వండి… నేను మాత్రం ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు సొరెన్. మొత్తం పరిణామాలపై జార్ఖండ్ సీనియర్ రాజకీయవేత్త ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం సోరెన్ శాసనసభ్యత్వాన్ని కోల్పోతారని తెలుసనని… ఎన్నికల సంఘం ఇప్పటికే అనర్హుడిగా ప్రకటించిందని… నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని… లేదంటే మొత్తం వ్యవహారంపై కోర్టు నుంచి స్టే పొందాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కాంట్రాక్టును తనకు తానుగా కేటాయించుకున్నందుకు సోరెన్‌పై అనర్హత వేటు పడుతోందని EC అభిప్రాయపడింది.

మైనింగ్ లీజు కేటాయించుకున్నందుకు సోరెన్‌పై ఫిర్యాదు నమోదైంది. సోరెన్‌పై అనర్హత వేటుకు సంబంధించి ఈసీ నిర్ణయంపై గవర్నర్ ఇవాళ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సోరెన్‌కు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం లేనందువల్ల గవర్నర్ ఆచితూచి నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై తీసుకోవాల్సిన నిర్ణయం కోసం సోరెన్ రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం వ్యవహారంపై క్లారిటీ వచ్చాక మాట్లాడతానంటూ గవర్నర్ బైస్ విలేకరులకు చెప్పారు. అనారోగ్యంతో గత రెండు రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందానన్న ఆయన… రాజ్‌భవన్ చేరుకున్నాక ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు.

ఐతే ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు 2024 వరకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జేఎంఎం స్పష్టం చేసింది. యూపీఏ భాగస్వామ్యపక్షాలతో సమావేశమైన సోరెన్…అందుబాటులో ఉండాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించాక హేమంత్ సోరెన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసీ అనర్హత వేసిన విషయం తెలియదన్న సోరెన్… బీజేపీ ఎంపీతో కలిసి కొందరు తొలుబొమ్మ జర్నలిస్టులు ఈసీ నివేదికను తయారు చేశారంటూ సీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోరెన్ మైనింగ్ లీజు పొడిగించుకోవడం అప్రజాస్వామికమన్న బీజేపీ… నైతిక కారణాలతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. హేమంత్ సోరెన్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే పేర్కొన్నారు. అసెంబ్లీని రద్దు చేసి మొత్తం ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. 82 మంది సభ్యుల అసెంబ్లీలో, జేఎంఎం-30, కాంగ్రెస్- 17 ఎమ్మెల్యేలున్నారు. సభలో రెండు పార్టీలకు 47 మంది సభ్యుల బలం ఉంది. మెజారిటీ మార్క్ కంటే కొంచెం ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు సోరెన్‌కు ఉంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అసెంబ్లీ లెక్కల ప్రకారం ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.