సెక్రటేరియట్‌కి తాళం వేసిన ఓనర్
అద్దె చెల్లించకపోవడంతో సెక్రటేరీయట్‌కి భవన ఓనర్ తాళం వేసిన సంఘటన కొనకనమిట్లలో శుక్రవారం చోటు చేసుకుంది. కొనకనమిట్ల సెక్రటేరియట్ సిబ్బందిని శుక్రవారం ఉదయం భవన యజమాని తిరుపతిరెడ్డి బయటకు పంపి భవనానికి తాళం వేశారు. మూడేళ్లుగా సిబ్బంది అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ఈ చర్యకు దిగినట్లు ఆయన తెలిపారు. 10 రోజుల్లో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం కానుందని, అక్కడికి తరలించనున్నారని, తనకు అద్దె చెల్లించకుండా తరలిస్తారన్న భయంతో తాళం వేసినట్లు పేర్కొన్నారు. దీంతో సిబ్బంది బయట కూర్చోవాల్సి వచ్చింది. పనులకోసం వచ్చిన ప్రజలు వెనుదిరిగారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీనివాసరావు సోమవారం అద్దె చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తిరుపతిరెడ్డి మధ్యాహ్నం ఒంటిగంటకు సెక్రటేరియట్‌ని తెరిచారు.