ఒలింపిక్స్ కంటే ముందు కామన్వెల్త్ నిర్వహించండి..
భారత ప్రభుత్వానికి కామన్వెల్త్ క్రీడల సమాఖ్య సీఈఓ కేటీ సాడ్లియెర్ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్ ఎప్పటి నుండో ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఆసక్తి కనబరుస్తోంది. అయితే దానికంటే ముందుగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తే మెగా ఈవెంట్ కంటే ముందు మార్గదర్శకంగా ఉంటుందని ఆమె సూచించారు. భారత్ దశ, దిశ మారుతోందని, ఇప్పుడు సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పనతో క్రీడల భవిష్యత్ మారబోతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్ పతకాల పట్టికలో భారత్ టాప్ 10లో నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2010లో భారత్ ఒకసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.