‘ఆమెతో మరోసారి నావల్ల కాదు’..చేతులెత్తేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. డిబేట్లు, ఇంటర్యూలు, స్టేజ్ షోలతో పోటాపోటీగా అభ్యర్థులు తలపడుతున్నారు. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరి మధ్యా డిబేట్ జరిగింది. మరోసారి తాను ఇలాంటి డిబేట్‌కు సిద్ధంగా లేనని, ఆమెతో తనవల్ల కాదని చేతులెత్తేశారు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్. ఆ చర్చలో కమలాహారిస్‌దే పైచేయి అని పత్రికలలో, మీడియాలో అనేక రివ్యూలు వచ్చాయి. వీటిపై మండిపడ్డారు ట్రంప్. తాను డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ కన్నా తానే ముందున్నానని, ఆమె ఓడిపోయిందన్నారు. సర్వేలన్నీ తప్పులు ప్రకటిస్తున్నాయని ఆరోపించారు. పరాజితురాలితో తాను మళ్లీ డిబేట్‌కు సిద్ధంగా లేనని ప్రకటించారు. గతంలో ప్రస్తుత అధ్యక్షుడు జోబైడన్, ట్రంప్‌ల మధ్య కూడా డిబేట్ జరిగింది. దానిలో ట్రంప్‌దే పైచేయి అయ్యింది. దీనితో డెమోక్రాట్ల నుండే వ్యతిరేకత రావడంతో తన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు బైడెన్. ఆమె పోటీలో వచ్చిన దగ్గర నుండి దేశవ్యాప్తంగా విరాళాలు జోరుగా సమకూరాయి. ట్రంప్, హారిస్‌ల మధ్య జరిగిన వివాదం అనంతరం కూడా ఒక్కరోజులోనే 47మిలియన్ డాలర్లు విరాళం సమకూరింది. అంటే భారత కరెన్సీలో రూ.394 కోట్లు సమకూరాయి. ఇకపోతే అక్టోబర్ 1న ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య కూడా చర్చ జరగనుంది. రిపబ్లికన్ అభ్యర్థి జేడీ వాన్స్, డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి టీమ్ వాజ్‌ల మధ్య ఈ చర్చ జరుగుతుంది.