‘లాజిస్టిక్స్ ఏర్పాట్లలో NDMA మద్దతు కావాలి’..సీఎస్ శాంతికుమారి
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం నేడు రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. ప్రత్యేక బృందాలకు శిక్షణ, ఇతర లాజిస్టిక్స్ ఏర్పాట్లలో NDMA మద్దతు కావాలని సి.ఎస్ కేంద్ర బృందాన్ని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్‌ల సమస్యను కూడా సీఎస్ ప్రస్తావించారు. ఈ సవాళ్లు ఎదుర్కోవడంలో కేంద్రం సహకారాన్ని కోరారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలిన సంఘటనలను, పర్యావరణ విపత్తు సమస్యను కూడా సి.ఎస్ ప్రస్తావించారు. ఈ పర్యావరణ విపత్తుకు మూలకారణాన్ని తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర బృందం సి.ఎస్ కు సూచించింది. విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వరదల కారణంగా సంభవించిన నష్టాలను, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి వివరించారు. వరద నష్టం ప్రాథమిక అంచనాలు రూ.5,438 కోట్లుగా ఉన్నాయని, పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలియజేశారు. వ్యవసాయం, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఇంధనం, పశుసంవర్ధక, అటవీ శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందాలకు జరిగిన నష్టాన్ని వివరించారు.